Saroja Devi | సినీ రంగంలో ఐదున్నర దశాబ్దాలుగా ఓ వెలుగు వెలిగిన దక్షిణాది సినీ తార బి. సరోజా దేవి సోమవారం కన్నుమూశారు. 87 ఏళ్ల వయసులో ఆమె బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి సినీ లోకానికే కాదు, అభిమానులకు కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆమె మృతికి ముందు రోజు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణించిన విషయం తెలిసిందే. వరుసగా ఇద్దరు నటుల మృతి చెందడంతో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. సరోజా దేవి 1955లో కన్నడ చిత్రమైన మహాకవి కాళిదాసుతో కథానాయికగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు.
1957లో తెలుగు చిత్రపరిశ్రమలో పాండురంగ మహత్యం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె ఎన్టీఆర్కు జోడిగా నటించగా, నిర్మాతగా కూడా ఎన్టీఆర్ వ్యవహరించారు. తొలి చిత్రం ఎన్టీఆర్తో నటించడం తనకు భయంగా అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో సరోజా దేవి గుర్తుచేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఆమెను ప్రోత్సహించి ధైర్యం కలిగించారని చెప్పారు. పాండురంగ మహత్యం తర్వాత సరోజా దేవి భూకైలాస్, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, దాగుడుమూతలు, శ్రీ కృష్ణార్జున యుద్ధం, అమరశిల్పి జక్కన్న వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 1955 నుంచి 1984 వరకు 161 సినిమాల్లో నాయిక పాత్రల్లో మాత్రమే నటించి, ఆ కాలంలో ఎలాంటి సపోర్టింగ్ రోల్స్ చేయకుండా రికార్డు సృష్టించారు. ఈ ఘనతను సావిత్రితో పాటు ఏ అగ్రనటి కూడా సాధించలేకపోయింది.
1967లో శ్రీహర్షను వివాహం చేసుకున్న సరోజా దేవి, 1986లో ఆయన మరణంతో తీవ్రంగా కలత చెందారు. లేడీస్ హాస్టల్ అనే చిత్రానికి మధ్యలో షూటింగ్ జరుగుతుండగా భర్తను కోల్పోయిన ఆమె, సినిమాల నుంచి దాదాపు విరమించారు. ఏడాది పాటు ఇంట్లోనే ఉండి, కుటుంబ సభ్యులతో తప్ప ఎవ్వరినీ కలవలేదు.అయితే అప్పటికే సైన్ చేసిన చిత్రాలను పూర్తి చేయడానికే తిరిగి చిత్రసీమలోకి అడుగుపెట్టారు. 1992లో విడుదలైన సామ్రాట్ అశోక సినిమా సరోజా దేవి చేసిన చివరి తెలుగు చిత్రం. ఈ సినిమాలో కూడా ఆమె ఎన్టీఆర్తో కలిసి నటించారు. గతంలో దానవీరశూర కర్ణ చిత్రంలో వీరి జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కాంబినేషన్ తెలుగు చిత్రసీమలో చిరస్మరణీయమైనదిగా నిలిచిపోయింది. సరోజా దేవి దత్తత తీసుకుని పెంచుకున్న కుమార్తె భువనేశ్వరి చిన్న వయసులోనే మరణించడం ఆమె జీవితంలో మరో విషాదం.