‘చుట్టూ వరదలు. చాలామంది కష్టాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మా సినిమా ఆడియన్స్‌కి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఇలాంటి సమయంలో మా సినిమాకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నిజమైన విజయానికి ‘సరిపోదా శనివారం’ ఓ నిర్వచనం. ఈ సక్సెస్ ప్రేక్షకులది. దర్శకుడిగా వివేక్ సక్సెస్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమాకు పనిచేసిన అందరూ ప్రాణంపెట్టి పనిచేశారు. అందుకే ఈ విజయం. ‘అంటే సుందరానికి’ మంచి డ్రామా ఉన్న సినిమా. ‘సరిపోదా శనివారం’ మంచి యాక్షన్ సినిమా. ఈ సారి వివేక్‌తో మంచి కామెడీ సినిమా చేస్తా’ అని నాని అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య, కల్యాణ్ దాసరి కలిసి నిర్మించిన ఈ సినిమా విజయోత్సవ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడారు. ఈ సినిమాకోసం అందరూ అహర్నిశలూ కష్టపడ్డారని, ఈ విజయం అందరిదీ అని దర్శకుడు వివేక్ ఆత్రేయ అన్నారు.
ఇంకా ఎస్.జె.సూర్య, ప్రియాంక్ అరుళ్మోహన్, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్, అలీ, శుభలేఖ సుధాకర్, హర్షవర్దన్లతో పాటు అతిథులుగా విచ్చేసిన దిల్‌రాజు, హను రాఘవపూడి, శివ నిర్వాణ, రాహుల్ సంకృత్యాన్ తదితరులు మాట్లాడారు.