తన తండ్రి సైఫ్ అలీఖాన్‌పై కొన్ని రోజుల క్రితం జరిగిన దాడి గురించి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఆయన కుమార్తె, నటి సారా అలీఖాన్ స్పందించింది. ఆ క్షణాలను ఆమె గుర్తు చేసుకుంటూ.. ‘ఆ పదిహేను నిమిషాలు నన్ను అయోమయస్థితిలో పడేశాయి. ఏం జరుగుతుందో అర్థంకాలేదు. షాక్‌లో ఉండిపోయా. ఆసుపత్రికి చేరుకునేవరకూ ఫోన్‌కాల్స్ వస్తూనే ఉన్నాయి. చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి నాన్న చిరునవ్వుతో బయటికి రావడం చూసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నా. మేమంతా కంగారు పడకూడదనే నాన్న నిబ్బరంగా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఆయనది పోరాడేతత్వం. కానీ నేను అలా కాదు.. ఊరకే ఏడ్చేస్తా. కంగారుపడిపోతా.’ అంటూ భావోద్వేగానికి లోనయ్యింది సారా. జనవరి 16న అర్ధరాత్రి సమయంలో సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఆయనపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఆ సంఘటనలో సైఫ్ అలీఖాన్ వెన్నెముకకు తీవ్రగాయమవ్వడంతో సర్జరీ చేశారు.