సాన్య మల్హోత్ర.. బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ‘దంగల్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది. కెరీర్ ప్రారంభంలోనే కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి.. అందరి దృష్టిలో పడింది. ‘బోల్డ్ కామెంట్స్’తో ఇంటర్నెట్లోనూ తెగ వైరల్ అయ్యింది. సాన్య నటించిన తాజా చిత్రం ‘మిసెస్’ ఇటీవలే ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. దేశంలో చాలామంది మహిళలు ఎదుర్కొనే సవాళ్లే ఇతివృత్తంగా వచ్చిన ఈ సినిమా.. హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది.
ఈ సందర్భంగా సాన్య ఓ ఆన్లైన్ మీడియాతో మాట్లాడుతూ.. మహిళల సమస్యలు, చిత్ర సీమకు సంబంధించిన విషయాలను పంచుకున్నది. ‘కొత్తగా పెళ్లయిన అమ్మాయి.. అత్తారింట్లో భర్త, కుటుంబసభ్యుల ప్రవర్తనతో ఎలాంటి ఇబ్బందులు పడుతుంది? శారీరకంగా, మానసికంగా ఎదుర్కొన్న సవాళ్లేంటి? అనేవే ఇందులో చూపించాం. నేను ‘మిసెస్’ స్క్రిప్ట్ చదివినప్పుడు.. అందులో నన్ను నేనే చూసుకున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.
మిసెస్ చిత్రంలో తాను పోషించిన పాత్ర ‘రిచా’లాంటి సవాళ్లను తానెన్నడూ ఎదుర్కోలేదనీ, కానీ తన తల్లి, సోదరితోపాటు తనచుట్టూ ఉండే ఎంతో మందిని చూశాననీ వెల్లడించింది. ఇప్పుడు మిసెస్ చిత్రంలో ‘రిచా’ను చూసిన తర్వాత.. సమాజంలో తప్పకుండా మార్పు వస్తుందనీ, మహిళలపై వివక్ష తగ్గుతుందని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేసింది. మలయాళ నటి నిమిషా సజయన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమాకు రీమేక్‌గా వచ్చిందే ‘మిసెస్’ చిత్రం. దీనికి ఆర్తి కడవ్ దర్శకత్వం వహించగా.. నిశాంత్, సియా మహాజన్ ప్రధాన పాత్రల్లో నటించారు.