‘హీరోయిజం.. మాస్ అప్పీల్ అనేవి భారతీయ సినిమాకు మూలాలు. బాలీవుడ్ సినిమా వీటిని మిస్ అయ్యింది. అవి సౌతిండియన్ సినిమాలో బాగా కనిపిస్తున్నాయి. అందుకే సౌత్ సినిమా ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధిస్తున్నది’ అన్నారు బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్‌దత్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సినిమా పోకడ గురించి ఆయన ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ‘సినిమా ప్రేక్షకులు ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి మహానగరాల నుంచి మాత్రమే రారు. జార్ఖండ్, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి కూడా వస్తారు.
వాళ్లకు హీరోయిజమే కావాలి. థియేటర్లలో ఈలలు వేయాలనుకుంటారు. గోల చేయాలనుకుంటారు. ఆ పరిస్థితి బాలీవుడ్లో అమితాబ్ టైమ్‌లో ఉండేది. ఆ తర్వాత మేం కూడా అలాంటి సినిమాలు చేశాం. ఇప్పుడైతే లేదు. ఇప్పుడు హీరోయిజం, మాస్ అప్పీల్ ఉన్న సినిమాలు దక్షిణాది నుంచి ఎక్కువగా వస్తున్నాయి.’ అని పేర్కొన్నారు సంజయ్‌దత్.