ప్రభాస్ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా ఇంటెన్స్ ఎమోషన్స్ కలబోసిన పాత్రలో కనిపించబోతున్నారు. గురువారం ఈ సినిమా తాలూకు రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రభాస్ సెట్లో అడుగుపెట్టారు. దాదాపు రెండు నెలల పాటు నాన్‌స్టాప్‌గా జరిగే ఈ షెడ్యూల్లో కీలక ఘట్టాలను తెరకెక్కిస్తారని తెలిసింది. ధిక్కార స్వభావి అయిన పోలీస్‌గా ప్రభాస్ పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందని, కథలోని ఓ ఎపిసోడ్లో ఆయన ఖైదీగా కూడా కనిపిస్తారని చెబుతున్నారు.
ముందుగా అనుకున్న సమయం కంటే షూటింగ్ ఆలస్యంగా మొదలైప్పటికీ.. త్వరితగతిన ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారట దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ముఖ్యంగా షూటింగ్ సందర్భంగా ప్రభాస్ లుక్ ఎక్కడా బయటకు రాకుండా ఆయన ప్రత్యేక శ్రద్థ తీసుకుంటున్నారని, అందుకే నాన్‌స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు.