Samyuktha | సంయుక్త గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. అందంతో పాటు తన అభినయంతో అభిమానులను ఆకట్టుకుంటున్నది. దాదాపు పదేళ్ల కిందట ఇండస్ట్రీలోకి వచ్చిన బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో నటిస్తున్నది. సంయుక్త ‘భీమ్లానాయక్’తో తెలుగుకు పరిచయమైంది. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష, డేవిల్ మూవీల్లో నటించి టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా మారింది. దాదాపుగా రెండేళ్లు సినిమాలకు దూరమైంది.
అయితే, సినిమాల్లో కనిపించకపోవడానికి కారణాలను మలయాళీ బ్యూటీ బయటపెట్టింది. తాను ఎప్పుడూ విరామం తీసుకోలేదని, ఈ గ్యాప్ ఎందుకంటే ఆమె అంగీకరించిన సినిమాల పూర్తి కావడంలో ఆలస్యం జరిగిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు భారీ చిత్రాల లైనప్‌తో అభిమానుల ముందుకు రాబోతున్నది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి సంయుక్త మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నది. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ 2’ చిత్రంతో ఆమె గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వనుంది. డిసెంబర్ తర్వాత సంక్రాంతి సందర్భంగా ‘నారీ నారీ నడుమ మురారీ’ అనే రొమాంటిక్ చిత్రంతో కనిపించనున్నది.
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘స్వయంభు’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘హైందవ’ చిత్రాల్లోనూ సంయుక్త కీలక పాత్రల్లో నటిస్తున్నది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో ఓ చిత్రంలో కూడా ఆమె నటించనున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు ఇతర చిత్రాల్లో సంయుక్త హవా కొనసాగిస్తున్నది. ‘మహారాజ్ఞి : క్వీన్ ఆఫ్ క్వీన్స్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నది. అలాగే, మలయాళంలో చాలాకాలంగా నిర్మాణంలో ఉన్న మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘రామ్’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక ‘బెంజ్’ చిత్రంలో కూడా కనిపించనున్నది. ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాది విడుదల కానున్నది.