Samantha | నటి సమంత రూత్ ప్రభు, ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు పెళ్లి తర్వాత ప్రశాంతంగా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో యోగిక్ విధానంలో వివాహం చేసుకున్న ఈ జంట, తాజాగా తమ సన్నిహిత మిత్రుల కోసం ఇంట్లో ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు నటి తమన్నా భాటియా హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్లకు సంబంధించిన ఫొటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో క్రిస్మస్ ట్రీ, డెకరేషన్తో అలంకరించిన ఇంటి ఫొటోను పోస్ట్ చేస్తూ, “ఈ క్రిస్మస్ డెకరేషన్‌ను నిజంగా తీసేయాలా?” అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చింది. మరో ఫొటోలో క్రిస్మస్ ట్రీ ముందు సమంత, రాజ్‌తో పాటు తమన్నా, ఇతర స్నేహితులు కలిసి నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. ఇది పెద్ద పార్టీలా కాకుండా ఇంట్లో జరిగిన ఆత్మీయ సమావేశంలా కనిపించడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. సమంత, రాజ్ నిడిమోరు పరిచయం వృత్తిపరమైన ప్రయాణం నుంచే మొదలైంది. 2021లో విడుదలైన అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2లో కలిసి పనిచేసిన వీరు, ఆ తర్వాత సిటాడెల్: హనీ బన్నీ ప్రాజెక్ట్‌లోనూ కలిసి పనిచేశారు. 2021లో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత వ్యక్తిగత జీవితంపై అప్పటినుంచి విస్తృత చర్చ జరిగింది.
2023లో సమంత, రాజ్ డేటింగ్లో ఉన్నారనే వార్తలు వచ్చినప్పటికీ, ఆ విషయాన్ని వారు ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. 2024లో సహజీవనం చేస్తున్నారనే ఊహాగానాలపై సమంత టీమ్ స్పందిస్తూ వాటిని ఖండించింది. అయినప్పటికీ, ఇద్దరూ కలిసి ఈవెంట్లలో కనిపించడం, సోషల్ మీడియా ఫొటోలలో దర్శనమివ్వడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో 2025 డిసెంబర్ 1న సమంత స్వయంగా తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుని పుకార్లకు తెరదించింది. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల సమక్షంలో జరిగిన ఈ వివాహం గురించి ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. వృత్తిపరంగా చూస్తే, సమంత, రాజ్ అండ్ డీకే కాంబినేషన్ మళ్లీ తెరపైకి రానుంది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందిస్తున్న భారీ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. మరోవైపు సమంత తన నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ ద్వారా 2025లో శుభం సినిమాను నిర్మించింది. ఇప్పుడు అదే బ్యానర్‌పై నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే తెలుగు సినిమాలో లీడ్ రోల్ చేస్తూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.