Samantha | సమంతతో కాసేపు మాట్లాడితే జీవితాన్ని తాను ఎంత కాచి వడపోసిందో అర్థమవుతుంది. వేదాంత ధోరణితో పాటు ఆత్మవిశ్వాసం కూడా ఆమె మాటల్లో తొణికిసలాడుతుంది. రీసెంట్గా తను నిర్మించిన ‘శుభం’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు సామ్. ‘కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలు చూశా. నన్నంతా ‘గోల్డెన్ లెగ్ ఆఫ్ తెలుగు సినిమా’ అన్నారు. ఒక్కసారిగా ఫ్లాప్ వచ్చింది.. భరించలేకపోయా.
దాంతో సక్సెస్‌పై నా దృష్టిలో నిర్వచనమే మారిపోయింది. అది శాశ్వతం కాదని అర్థమైంది. ప్రస్తుతం నేను సక్సెస్‌లో లేనని చాలామంది అంటున్నారు. నిజానికి నేను సక్సెస్‌లోనే ఉన్నా. గతంతో పోలిస్తే ఇప్పుడే విజయవంతంగా రాణిస్తున్నా. నచ్చినట్టు బతకడమే కదా సక్సెస్.’ అన్నారు సమంత. కాస్త విరామం తర్వాత ‘రక్త్ బ్రహ్మాండ్’ షూటింగ్లో పాల్గొన్నానని, బ్రేక్ తీసుకోవడం వల్లనేమో.. యాక్టింగ్ కష్టం అనిపించిందని సమంత చెప్పారు. ‘జీవితం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ‘ఊ అంటావా’ పాట ఆఫర్ వచ్చింది. అలాంటి పాట నేనెప్పుడూ చేయలేదు. నాకు నేను హాట్ గర్ల్‌గా ఎప్పుడూ అనుకోలేదు. అసలలా ఊహించను కూడా. సెట్లో అడుగుపెట్టినప్పుడు కాస్త కంగారు పడినా.. ధైర్యం కూడగట్టుకొని, సవాలుగా తీసుకొని ఆ పాట చేశా. మళ్లీ అలాంటి పాటలో యాక్ట్ చేస్తాననుకోవడం లేదు.’ అని తెలిపారు సమంత. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అభిమానులేనని, అందుకే వాళ్లు ఎప్పుడైనా ఫొటోలు అడిగితే కాదనననీ, తన తండ్రి మరణవార్త తెలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లో తనను ఫొటోలకోసం రిక్వెస్ట్ చేశారని, వారికోసం అంత బాధలోనూ నవ్వుతూనే ఫొటోలు దిగానని సమంత గుర్తు చేసుకున్నారు.