Samantha | తనకు తాను ప్రేమించుకోవడం.. ఆరోగ్యం.. మానసిక ప్రశాంతత.. ప్రస్తుతం సమంత ప్రాధాన్యత వీటికే. నచ్చినట్టు బతుకుతున్నారు. నచ్చిన సినిమాలు చేస్తున్నారు. మహిళాసాధికారత, వ్యక్తిగత సంరక్షణ తదితర అంశాలపై ఇన్‌స్టా ద్వారా సందేశాలిస్తున్నారు. దాన్ని ఆమె బాధ్యతగా భావిస్తారు కూడా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనలో వచ్చిన మార్పును వివరించారు. ‘నేను ఇండస్ట్రీకొచ్చి దాదాపు 20ఏండ్లు అవుతోంది. అప్పట్లో ఎన్ని సినిమాలు చేశాం.. ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాం.. ఎన్ని మల్టీ నేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించాం.. అనేవే స్టార్డమ్కు కొలమానాలు.
దానికి తగ్గట్టే ఊపిరాడకుండా సినిమాలు చేశా. ఓ దశలో అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నా. ఎన్నో మల్టీనేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించా. అప్పట్లో ఈ విషయంపై ప్రౌడ్‌గా ఫీలయ్యేదాన్ని. కానీ ఇప్పుడు మనసు పెరిగింది. సమాజంపై బాధ్యత కూడా పెరిగింది. ప్రజలకు హాని చేసే ఉత్పత్తులను ఓ దశలో ప్రమోట్ చేసినందుకు సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పుకుంటున్నా. ఇప్పటికీ నా చేతిలో ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. గడచిన ఏడాదిలో కోట్లలో డబ్బు ఇస్తామని వచ్చినప్పటికీ దాదాపు 15 బ్రాండ్స్‌ని స్వచ్ఛందంగా వదులుకున్నా. వాణిజ్య ప్రకటనల ఆఫర్లు ఇంకా వస్తూనే ఉన్నాయి.
కాకపోతే వాటిని గతంలో మాదిరిగా వెంటనే అంగీకరించడంలేదు. తెలిసిన వైద్యులతో ఆయా ఉత్పత్తులను పరిశీలించి, అవి సమాజానికి చేటు తెచ్చేవి కావని నిర్ధారించుకున్న తర్వాతే వాటికి పనిచేస్తున్నా. సినిమాలు కూడా అన్నీ అంగీకరించడంలేదు. కథలో పాత్రకు విలువ ఉందని అనిపిస్తేనే ఒప్పుకుంటున్నా. నచ్చిన పాత్రలు దొరక్కపోతే సొంతంగా సినిమాలు తీసుకుంటా. అంతేతప్ప ఆత్మవంచన చేసుకొని నటించను.’ అంటూ చెప్పుకొచ్చారు సమంత. ప్రస్తుతం ఆమె ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే సిరీస్‌లో నటిస్తున్నారు. అలాగే ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు. ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ సినిమా త్వరలో విడుదల కానుంది.