Samantha | దసరా పండగ సందర్భంగా తన అభిమానులకు ఓ స్పెషల్ అప్డేట్ను ఇచ్చింది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు. ‘‘కొత్త ప్రయాణం’’ అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేసిన ఆమె, మళ్లీ ఒక్కసారిగా ఫ్యాన్స్‌లో, నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తించారు. ఇటీవల ఆమె రెండో పెళ్లి వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో, ‘‘కొత్త ప్రయాణం’’ అనే మాట మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే సమంత పోస్ట్ చేసిన ‘‘కొత్త ప్రయాణం’’ అనే విషయం పెళ్లికి సంబంధించినది కాదు. కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన క్రమంలో ఈ కామెంట్ చేసింది. ఇక కొత్త ఇంటి ఫోటోను ఆమె స్వయంగా షేర్ చేసింది. ఇంటి గోడపై ‘‘SAM’’ అనే లోగోను స్టైలిష్‌గా ఏర్పాటు చేయగా, అదే ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఇది హైదరాబాద్‌లోని ? లేక ముంబయిలోనా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు, సమంత మధ్య గత కొంతకాలంగా సన్నిహిత సంబంధం ఉందని ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ సిరీస్‌ల్లో కలిసి పని చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్లకు హాజరై మీడియా కంట పడుతున్నారు. దీంతో సమంత త్వరలో రెండో వివాహం చేసుకోనుందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె కొత్త ఇంటికి షిఫ్ట్ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది. అయితే దీనిపై సమంత నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
ఇక సినిమాల పరంగా చూస్తే, సమంత ప్రస్తుతం రెండు ప్రాజెక్టులపై పని చేస్తోంది. ఒక్కటి పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న “రక్త్ బ్రహ్మాండ: ది బ్లడీ కింగ్డమ్”, మరొకటి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న “మా ఇంటి బంగారం”. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అభిమానులు చాలా కాలంగా సమంతను పెద్ద తెరపై మళ్లీ చూడాలనుకుంటుండగా, ఈ సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘‘కొత్త ఇంటి లోగోతో, కొత్త జీవితం వైపు అడుగులు వేస్తున్న సామ్.. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారా?’’ అనే ఉత్కంఠతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.