Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తరచూ తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ హైలైట్ అవుతూ ఉంటారు. తాజాగా సమంత తన జీవితంలో కొత్త జర్నీని ప్రారంభించారు . అదే కొత్త ఇంటి గృహప్రవేశం. గృహప్రవేశం సందర్భంగా సమంత ఎరుపు రంగు సాంప్రదాయ దుస్తుల్లో పూజలు నిర్వహించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పిక్స్‌లో దేవాలయ వాతావరణం, పూజ సమయంలో ఆమె శాంతమైన ముఖం అందరినీ ఆకట్టుకుంటోంది. సమంత ముఖానికి కుంకుమ పెట్టుకుని పూజలో సంప్రదాయబద్ధంగా పాల్గొనడం నెట్లో హైలైట్‌గా మారింది.
ఇక “ ఫోటో డంప్ ” పేరుతో సమంత పోస్ట్ చేసిన ఫోటోల్లో కొత్తింటి అందాలు, పూజ సన్నివేశాలు, అలాగే ఆమె జిమ్ వర్కౌట్ క్లిప్స్ కూడా ఉన్నాయి. “ నేను ఆలోచించేది, చెప్పేది, చేసేది, లక్ష్యంగా పెట్టుకునే ప్రతిదీ నా అత్యున్నత స్వభావాన్ని గౌరవించాలి. నేను అదే నేర్చుకున్నాను. ఇప్పుడు అది చేయగలనని ఆశిస్తున్నాను ” అని ఆమె రాసిన క్యాప్షన్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఆరోగ్యం విషయంలో కూడా అవగాహన పెంచుతూ, మోటివేషన్ కోట్స్ షేర్ చేసే సమంత .. ప్రస్తుతం తన కెరీర్లో కూడా కొత్త దారిలో ముందుకెళ్తున్నారు.
మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకున్న తర్వాత ఆమె వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి ‘సిటాడెల్: హానీ బన్ని’ , ‘రక్త్ బ్రహ్మాండ్’ వంటి ప్రాజెక్టులతో ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె నిర్మాతగా కూడా అరంగేట్రం చేశారు. తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పై ‘శుభం’ సినిమాను నిర్మించి, ఇప్పుడు అదే బ్యానర్లో హీరోయిన్గా ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా త్వరలో ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ హిందీ వెబ్ సిరీస్‌లో కనిపించనున్నారు. మొత్తానికి కొత్త ఇల్లు, కొత్త ఆరంభం, కొత్త ఉత్సాహం — సమంత జీవితంలో మరో అందమైన అధ్యాయం మొదలైంది అని చెప్పొచ్చు!