Samantha | టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన సమంత ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతుందని టాక్. ఇప్పటికే నటిగా తన టాలెంట్ నిరూపించుకున్న సమంత, తాజాగా దర్శకురాలిగా మారే ఆలోచనలో ఉన్నారు అనే వార్తలు సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. సమంత ప్రస్తుతం ఓ క్యూట్ లవ్ స్టోరీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిందని, కథకు తానే డైరెక్షన్ వహించాలనుకుంటోందని సమాచారం. ఇప్పటికే కొన్ని యంగ్ అప్‌కమింగ్ ఆర్టిస్టులతో డిస్కషన్స్ జరిపిందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను కూడా తన సొంత బ్యానర్లోనే నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు టాక్
ఇప్పటికే సమంత ‘శుభం’ అనే హర్రర్-కామెడీ సినిమాతో ప్రొడ్యూసర్‌గా అడుగుపెట్టి, తన కెరీర్లో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు డైరెక్షన్ వైపు అడుగులేస్తోంది అంటే, నటనతో పాటు ఫిల్మ్‌మేకింగ్‌పై ఉన్న ఆమె ప్యాషన్ స్పష్టంగా తెలుస్తోంది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’, ‘హనీ బన్నీ’ వంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్టుల్లో సమంత నటనతో ఆకట్టుకుంది. యాక్షన్ రోల్స్‌లో తన స్థాయిని పెంచుకున్న సమంత, ఇప్పుడు దర్శకురాలిగా ఎలాంటి నూతన కోణాన్ని చూపిస్తుందో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కానీ సమంత నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆమె అభిమానులు మాత్రం ఈ వార్తలపై ఉత్సాహంగా స్పందిస్తున్నారు. డైరెక్టర్ సమంత ఏ విధంగా తన టాలెంట్‌ను చూపుతుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నటిగా, నిర్మాతగా, ఇప్పుడు దర్శకురాలిగా కూడా సమంత తన టాలెంట్‌ను పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోందంటే… ఆమె కెరీర్ మరో కీలక మలుపు తిరగబోతోందున్నమాట . మరి ఇది గాసిపో, నిజమా అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మరోవైపు సమంతా రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రాజ్ అండ్ డికె పర్యవేక్షణలో ఇది రూపొందుతుండగా , ఏవో ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయిందనే ప్రచారం జరిగింది కానీ అలాంటిదేమి లేదని ఇటీవలే ప్రొడ్యూసర్లు క్లారిటీ ఇచ్చారు. అయితే షూట్ తిరిగి మొదలయ్యింది లేనిది అనే దానిపై క్లారిటీ లేదు. మరో వైపు మా ఇంటి బంగారం అనే సినిమాని సామ్ గతంలోనే ప్రకటించింది. దీనికి నందినిరెడ్డి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉంది.