కథానాయిక సమంత సినిమాలకు కాస్త విరామం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధి బారినపడిన ఆమె దాని చికిత్స కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుందని సమాచారం. గత కొంతకాలంగా ఆమె మయోసైటిస్కు చికిత్స పొందుతూ ‘శాకుంతలం’ ప్రమోషన్‌తో పాటు ‘ఖుషి’ సినిమా షూటింగ్, సిటాడెల్ వెబ్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు వీటి చిత్రీకరణ పూర్తికావడంతో ఓ ఏడాది పాటు సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని దీనికి అవసరమైన అదనపు చికిత్సతో పాటు మనసును ప్రశాంతంగా వుంచుకోవడం కోసం అన్ని పనులు దూరంగా పెట్టి యోగా, మెడిటేషన్‌కు పూర్తి సమయం కేటాయించాలని సమంత డెసిషన్ తీసుకున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ఇందుకోసమే గత కొంతకాలంగా కొత్త సినిమాలు ఆమె అంగీకరించలేదని, గతంలో అంగీకరించి ఇంకా చిత్రీకరణ ప్రారంభం కాని చిత్రాల అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేస్తున్నారని అంటున్నారు. సో.. త్వరలోనే పూర్తి ఉత్సాహంతో, పూర్తి ఆరోగ్యంతో సమంత మళ్లీ షూటింగ్‌లతో బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.