Samantha | టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం, అభినయం, డెడికేషన్… అన్నింటినీ సమపాళ్లలో కలిపి ప్రతి పాత్రలోనూ పరకాయప్రవేశం చేస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. కెరీర్ పరంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సమంత, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. సమంత తన సహనటుడు నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లైన నాలుగేళ్లకే వీరి విడాకులు సినీ అభిమానులను షాక్‌కు గురిచేశాయి. ఆ తర్వాత సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడాల్సి వచ్చింది. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ధైర్యంగా నిలబడి మళ్లీ తన జీవితాన్ని ట్రాక్‌లోకి తీసుకొచ్చింది.
ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంతకు సంబంధం ఉందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఆ రూమర్స్‌కు ముగింపు పలుకుతూ, గత ఏడాది డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్ సమీపంలోని లింగ భైరవి ఆలయం వద్ద భూతశుద్ధ పద్ధతిలో వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. వివాహం అనంతరం సమంత మరింత బిజీగా మారింది. ఒకవైపు పలు బ్రాండ్లను ప్రారంభిస్తూ బిజినెస్ రంగంలో అడుగులు వేస్తూనే, మరోవైపు సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టింది. తన స్వంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రెండో సినిమాగా రూపొందుతున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో సహనిర్మాతగా వ్యవహరిస్తూనే, లీడ్ రోల్ కూడా పోషిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లో సమంత యాక్షన్ పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక సినిమాలకే కాదు, ఫిట్‌నెస్‌కూ సమంత ఎంత ప్రాధాన్యం ఇస్తుందో తెలిసిందే. నిత్యం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ప్రేరణగా నిలుస్తోంది. తాజాగా ఆమెకు ట్రైనర్ @emmyrwhite ఓ కఠినమైన ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు.ఆ ఛాలెంజ్ ఏంటంటే… సాధారణ పుష్అప్స్ కాదు. పుష్అప్స్ చేస్తూనే ముందుకు–వెనక్కి కదలాలి. ఎడమ చేయితో కుడి కాలిని, కుడి చేయితో ఎడమ కాలిని తాకాలి. ఈ మొత్తం సమయంలో శరీరం నేలను తాకకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. వినడానికి కష్టంగా ఉన్న ఈ ఛాలెంజ్‌ను సమంత సునాయాసంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సమంత షేర్ చేసిన ఈ వీడియో చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు.