Samantha | టాలీవుడ్లో అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ప్రస్తుతం నటనతో పాటు నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కొంతకాలం అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో తన భవిష్యత్తు గురించి చాలా ఆలోచించానని ఆమె తాజాగా వెల్లడించారు. ఆ సమయంలో నటన ఒక్కటే తన జీవితానికి ఆధారం కాకూడదనే ఆలోచన వచ్చిందని, తనకు నచ్చిన ఇతర రంగాలపై దృష్టి పెట్టడం ప్రారంభించానని చెప్పారు. తన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచించిన సమయంలో.. సినిమాలకు కొంత విరామం తీసుకోవాల్సి వచ్చిందని సమంత తెలిపారు. ఆ సమయంలో భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై ఎక్కువగా ఆలోచించినట్లు చెప్పారు. తనకు నమ్మకం ఉన్న పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించానని వెల్లడించారు.
నా సొంతంగా ఏదైనా నిర్మించుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. వ్యాపారవేత్తగా మారిన తర్వాత నా జీవితాన్ని మరో కోణంలో ఆస్వాదిస్తున్నాను అని సమంత పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న సమయంలో ‘సిటాడెల్’ షూటింగ్లో పాల్గొనడం తనకు చాలా కష్టంగా అనిపించిందని సమంత గుర్తుచేసుకున్నారు. తన వల్ల చిత్రబృందంలోని ఇతరుల సమయం వృథా కాకూడదని భావించి.. ఆ సమయంలో షూటింగ్ చేయలేనని చెబుతూ ఎన్నో ఈమెయిల్స్ పంపినట్లు తెలిపారు. అయితే చిత్రబృందం మాత్రం తనపైనే నమ్మకం ఉంచిందని, తానే ఆ పాత్రను చేయాలని కోరుకుందని చెప్పారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు చివరకు ప్రాజెక్ట్ను పూర్తి చేశానని సమంత వెల్లడించారు. ‘మా ఇంటి బంగారం’ విషయంలో మొదట తాను నటిగా కాకుండా కేవలం నిర్మాతగా తెరవెనుక ఉండాలని భావించినట్లు సమంత తెలిపారు. అయితే దర్శకుడు రాజ్ తనను ప్రోత్సహించడంతో పాటు నటించాల్సిందేనని పట్టుబట్టారని చెప్పారు.
దీంతో మరోసారి కెమెరా ముందుకు వచ్చానని సమంత వెల్లడించారు. నటనకు దూరంగా ఉండాలని ఒక దశలో భావించినప్పటికీ.. పరిస్థితులు తనను మళ్లీ నటన వైపు తీసుకొచ్చాయని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. గతంలో తనపై వచ్చే ట్రోలింగ్ తనను చాలా బాధించేదని సమంత చెప్పారు. ముఖ్యంగా మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూల వ్యాఖ్యలు తనపై ప్రభావం చూపేవని తెలిపారు.అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. కాలం తనకు ఎన్నో విషయాలు నేర్పించిందని, ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోవడం చాలా వరకు తగ్గించుకున్నానని సమంత పేర్కొన్నారు.నా గురించి ప్రతికూలంగా మాట్లాడాలని ఎవరైనా ముందే నిర్ణయించుకున్నప్పుడు.. నేను ఏం చెప్పినా వారి అభిప్రాయాన్ని మార్చలేను. అలాంటప్పుడు వాళ్లను ఒప్పించడానికి నా సమయాన్ని ఎందుకు వృథా చేసుకోవాలి? అని సమంత ప్రశ్నించారు. మన జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాని కోసం ముందుకు వెళ్తున్నప్పుడు.. ఇతరులు ఏమనుకుంటున్నారో ఎక్కువగా ఆలోచించకూడదు. నా శాంతి, నా ఆనందం, నా లక్ష్యాలపై దృష్టి పెట్టడం నేర్చుకున్నాను అని సమంత తెలిపారు.