Fauji | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో అనుకున్న తేదీకి ‘ఫౌజీ’ వస్తుందా? అనే చర్చ మొదలైంది. ‘ఫౌజీ’ చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రభాస్ కూడా సినిమాకు భారీగా కాల్షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ఒకేసారి రెండు, మూడు చిత్రీకరణ బృందాలతో షూటింగ్ నిర్వహిస్తూ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారని టాక్.
సినిమాను డిసెంబర్ 3న విడుదల చేయాలనే విషయంలో చిత్రబృందం మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ నిర్మాణ పనులు, మిగిలిన చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులను దృష్టిలో పెట్టుకుని విడుదల తేదీపై పరిశ్రమ వర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఒకవేళ ‘ఫౌజీ’ డిసెంబర్ మొదటి వారంలో విడుదల కాకపోతే.. ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ఇప్పటికే కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది విశ్వక్ సేన్ నటిస్తున్న ‘లెగసీ’. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 4న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో డిసెంబర్ మొదటి వారంలో తన స్థానాన్ని ఈ సినిమా ముందుగానే ఖరారు చేసుకుంది.
మరోవైపు దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘శ్రీ శ్రీ’ సినిమా కూడా డిసెంబర్ మొదటి వారంలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.అలాగే యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ప్రభాస్ లాంటి భారీ పాన్ ఇండియా స్టార్ సినిమా అదే సమయంలో విడుదలకు సిద్ధంగా ఉంటే.. విశ్వక్ సేన్, దుల్కర్ సల్మాన్, నాగచైతన్య సినిమాల నిర్మాతలు డిసెంబర్ మొదటి వారాన్ని ఎంచుకునే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించేవారు. కాని ఆయన తప్పుకోవడంతో వీరు రేసులోకి వచ్చారు. ‘ఫౌజీ’ డిసెంబర్ నుంచి తప్పుకుంటే.. వచ్చే ఏడాది వేసవికి వస్తుందా అనే చర్చ కూడా ఇండస్ట్రీలో నడుస్తుంది.