గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి అగ్ర కథానాయిక సమంత హాజరైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. దక్షిణాది సినీరంగం నుంచి ఒక్క సమంతకే ఆహ్వానం అందడం విశేషం. ఈ వేడుకలో పాల్గొనడం పట్ల సమంత ఆనందం వ్యక్తం చేసింది. ఇదొక జీవితకాల అనుభవమని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా తన సోషల్మీడియా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
‘చిన్నతనంలో నన్ను ప్రోత్సహించేవారు ఎవరూ లేరు. ఇలాంటి ఉన్నత వేదికలోకి అడుగుపెడతానని నా అంతరాత్మ కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఇలాంటి కలలు ఊహించడానికి కూడా చాలా పెద్దగా అనిపించేవి. నాకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఈ దేశంలో ఉండటం అదృష్టం. ఈ భాగ్యానికి ఎప్పటికి కృతజ్ఞురాలిని’ అని సమంత తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత తెలుగులో స్వీయ నిర్మాణంతో తెరకెక్కిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.