బాలీవుడ్లో ఇటీవల కాలంలో అతి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ‘పఠాన్’. ఈ చిత్రంలో షారుఖ్, దీపికా, జాన్ అబ్రహాం మూడు కీలక పాత్రలు పోషించగా…అతిథిగా మెరిశారు సల్మాన్ ఖాన్. టైగర్ పాత్రలో ఆయన కనిపించిన సన్నివేశాలు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. అయితే ఈ చిత్ర విజయానికి పూర్తి కారణం షారుఖ్నే అని చెప్పారు సల్మాన్. ఈ సక్సెస్ క్రెడిట్ తాను తీసుకోవడం సరికాదన్నారు.
తాజాగా ఓ కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడుతూ…‘షారుఖ్ సినిమా చూసేందుకు అభిమానులు ఎంతో ఎదురుచూశారు. వారు వేచిన చూసిన ఫలితం దక్కింది. ‘పఠాన్’ రికార్డ్ హిట్టయ్యింది. దీనికి పూర్తి క్రెడిట్ తీసుకోవాల్సింది హీరో షారుఖ్నే. ఆ తర్వాత నిర్మాత ఆదిత్య కపూర్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్కు దక్కుతుంది’ అని అన్నారు. ‘జీరో’ చిత్రం తర్వాత సల్మాన్, షారుఖ్ కలిసి నటించిన చిత్రమిది. త్వరలో వీరిద్దరు కలిసి ‘టైగర్ వర్సెస్ పఠాన్’ అనే సినిమాలో నటించబోతున్నారు.