సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్-3’. మనీష్శర్మ దర్శకుడు. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఐదో చిత్రమిది కావడం విశేషం. ‘టైగర్ జిందా హై’ (2017)కు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అవెంజర్స్: ఎండ్‌గేమ్, స్పైడర్‌మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్, ఐయామ్ లెజెండ్ వంటి చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన క్రిష్ బార్నెస్ పనిచేయబోతున్నారు. సముద్రంపై యాక్షన్ ఘట్టాలను తీయడంలో క్రిష్ బార్నెస్‌కు మంచి పేరుంది. ‘టైగర్-3’లో కూడా ఇప్పటివరకు భారతీయ సినిమాలో చూడనటువంటి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని, యష్రాజ్ఫిల్మ్స్లో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న చిత్రమిదేనని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సముద్రపు యాక్షన్ ఎపిసోడ్‌ను మద్ అనే ద్వీకకల్పంలో తెరకెక్కించబోతున్నారని సమాచారం. ‘టైగర్-3’ చిత్రంలో కత్రినాకైఫ్ కథానాయికగా నటిస్తుండగా, ఇమ్రాన్హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.