Harish Shankar | టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో హరీష్ శంకర్ ఒకరు. ఆయన గబ్బర్ సింగ్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ హరీష్ శంకర్‌కి ఆ రేంజ్లో హిట్ పడలేదు. డిజాస్టర్ ఫేజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ నాలుగైదు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాటిలో బాలీవుడ్ హీరోతో సినిమా కూడా ఒకటి ఉన్నట్టు తెలుస్తుంది. గత ఏడాది రిలీజ్ అయిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో హరీష్ శంకర్ భారీ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. ‘రైడ్’ అనే హిందీ సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా కనీసం యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేకపోయింది.
పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం చేసి మంచి హిట్ కొడతాడా అని అందరు అనుకున్నారు. కాని ఈ సినిమా ఇప్పటికీ సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇక హరీష్ శంకర్ ఏ హీరోతో సినిమా చేస్తాడు అంటే రోజుకొక హీరో పేరు వినిపిస్తుంది. ఇటీవల ఆయన సల్మాన్ ఖాన్ కి ఓ కథ చెప్పాడని, హరీష్ శంకర్ నేరేషన్ కి ఫిదా అయిన కండల వీరుడు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుందని, త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని చెబుతున్నారు.
ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ ట్రాక్ రికార్డు చాలా దారుణంగా ఉంది. ఆయన ‘భజరంగీ భాయిజాన్’ లాంటి బ్లాక్ బస్టర్ చూసి ఏళ్లు గడిచింది. ఇలాంటి సమయంలో హరీష్ శంకర్‌ని నమ్ముకొని సినిమా చేస్తాడా అనే అనుమానం అందరిలో ఉంది. ఇటీవల సౌత్ డైరెక్టర్ మురుగదాస్‌తో సికందర్ చేయగా, అది సల్మాన్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అనేది కూడా అందరిలో అనేక సందేహాలు కలిగిస్తుంది. ఒకవేళ హరీష్ శంకర్ – సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో సినిమా పక్కా అయితే గనక ఈ డైరెక్టర్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎదురు కాబోతోంది అనే చెప్పాలి. హరీష్ సల్మాన్ కోసం సాలిడ్ కథని సిద్ధం చేశాడని టాక్. ఈ ఏడాది చివర్లో మూవీ ఓపెనింగ్ జరగబోతుందని సమాచారం. హరీష్ శంకర్ చేతిలో పవన్ సినిమాతో పాటు కేవీఎన్ ప్రొడక్షన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్లలో కూడా సినిమా చేయనున్నట్టు సమాచారం..మరి పవన్ ప్రాజెక్ట్ హరీష్ ఎప్పుడు మొదలు పెడతాడా అని అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు.