Oka Roju | నటి సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ ఇప్పుడు తెలుగులో ‘ఒక రోజు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా రాబోతున్న ఈ సినిమాను అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక తెలుగు ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. జపాన్ మంచు కొండల నేపథ్యంలో సాగే ఈ సుందరమైన ప్రేమకథలో సాయిపల్లవి తన సహజ సిద్ధమైన నటనతో మరోసారి మాయ చేయబోతున్నట్లు సమాచారం.
ట్రైలర్ చూస్తుంటే.. కేవలం ఒకే ఒక్క రోజులో జరిగిన పరిణామాలు ఇద్దరు వ్యక్తుల జీవితాలను ఎలా మార్చాయనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న సినిమా కావడం, దానికి తోడు సాయిపల్లవి లాంటి ప్రతిభావంతురాలైన నటి ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ విభిన్నమైన ప్రేమకథను మే 1వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.