Sai Pallavi | ఓ విధంగా సాయిపల్లవిని సౌతిండియన్ లేడీ సూపర్‌స్టార్ అనొచ్చు. భాషలకూ, ప్రాంతాలకూ అతీతంగా అభిమానులున్నారామెకు. తనకోసమే థియేటర్లకెళుతున్న ప్రేక్షకులు కూడా కోకొల్లలు. నిజం చెప్పాలంటే హీరోలతో సమానమైన ఇమేజ్ ఆమెది. రీసెంట్గా ‘అమరన్’లో ఇందుగా నట విశ్వరూపమే చూపించేసింది సాయిపల్లవి. సినిమాలను ఎన్నుకునే విషయంలోనూ ఈ మలయాళ మందారం ఆచితూచి అడుగులేస్తున్నది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘తండేల్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దేశభక్తి నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది.
ఇదిలావుంటే.. తాజాగా మరో తెలుగు సినిమాకు సాయిపల్లవి సంతకం చేసిందట. పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ఈ సినిమాకు ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జూలైలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. కానీ కథానాయిక పేరును మాత్రం ధృవీకరించలేదు. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు సాయిపల్లవి ఓకే అయ్యిందని తెలుస్తున్నది. సాయిపల్లవికి కూడా కథ బాగా నచ్చిందట. ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ నెలాఖరున మొదలుకానున్నట్టు తెలుస్తున్నది.