పెళ్లి అనే కాన్సెప్ట్‌ని తక్కువ చేసి మాట్లాడేవాళ్లకు సున్నితంగా చురకలు అంటించింది అగ్రనటి సాయిపల్లవి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘పెళ్లయిన వారంతా.. మిగతావాళ్లతో ‘పెళ్లి చేసుకోకపోవడమే బెటర్’ అన్నట్టు చెబుతుంటారు. ఎక్కువశాతం పెళ్లి పట్ల మంచి అభిప్రాయం లభించలేదు నాకు. నన్నడిగితే అన్ని బంధాలకూ మూలం పెళ్లే. మనిషికి ఎన్నో అనుభూతులు పెళ్లి కారణంగా సంక్రమిస్తాయి.
ఉదాహరణకు మధ్య రాత్రి అన్నం తినకుండా మారాం చేస్తుంటే మనల్నెవరూ ఊరడించరు. బుజ్జగించి భోజనం పెట్టరు.. ఒక్క అమ్మ తప్ప. ఆ సమయంలో ఆమ్మ మాత్రమే మన పక్కన కూర్చోగలదు. పెళ్లి అనే బంధమే లేకపోతే ఆ అనుభవం ఎవరికీ ఉండదు కదా.. నాగరిక ప్రపంచంలో అమ్మనాన్న అనే బలమైన బంధాలకు పునాది పెళ్లే’ అంటూ పెళ్లి గొప్పతనాన్ని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.