పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తారు నటి సాయిపల్లవి. ప్రాధాన్యత లేని పాత్రల్లో ఆమె నటించిన దాఖాలాలు అస్సలు లేవు. గత ఏడాది ‘అమరన్’తో, ఈ ఏడాది ‘తండేల్’తో పలకరించిన ఈ తమిళ సోయగం.. ప్రస్తుతం బాలీవుడ్ ‘రామాయణ’లో నటిస్తున్నారు. అందులో ఆమె సీతగా కనిపించనున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి నటించిన తొలి బాలీవుడ్ సినిమా ‘మేరే రహో’ త్వరలో విడుదల కానుంది.
ఇదిలావుంటే.. ప్రస్తుతం సాయిపల్లవి గురించి ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ మీడియాలో బలంగా వినిపిస్తున్నది. కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో ఆమె నటించనున్నారనేది ఆ వార్త సారాంశం. శింబు ఇందులో కథానాయకుడు. వెట్రిమారన్ ‘వడా చెన్నై’ తరహాలోనే ఈ సినిమా కూడా ఉంటుందని తెలుస్తున్నది. నిజానికి వెట్రిమారన్ దర్శకత్వంలో సాయిపల్లవి ఇంతకు ముందే నటించారు. నెట్ఫ్లిక్స్ కోసం ఆయన చేసిన ‘పావ కథైంగల్’లో ఒక ఎపిసోడ్లో సాయిపల్లవి లీడ్రోల్ చేశారు. పూర్తిస్థాయి సినిమా చేయడం మాత్రం ఇదే ప్రథమం.