‘పదేళ్ల అందమైన ప్రయాణం తేజుది. ఫైటర్‌లా పదేళ్ల ప్రయాణం పూర్తి చేశాడు. పాత్రకోసం తపించే నటుడు తేజు. మూర్తీభవించిన మంచి తనం తను. ఆంజనేయుడి సాక్షిగా చెబుతున్నా. యాక్సిడెంట్ తర్వాత తేజు ఇక్కడ నిలబడ్డాడంటే కారణం కేవలం మీ అందరి ఆశీస్సులే. ఆ టైమ్‌లో అందరం చాలా భయపడ్డాం. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు. ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మించిన నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా.’ అని అగ్రహీరో రామ్‌చరణ్ అన్నారు. సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు ‘సంబరాల యేటిగట్టు’(SYG) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం కార్నేజ్ లాంచ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన రామ్‌చరణ్ సినిమా టైటిల్‌ను లాంచ్ చేసి, పై విధంగా స్పందించారు. సాయిదుర్గతేజ్ మాట్లాడుతూ ‘హెల్మెట్ పెట్టుకోవడం వల్లే నేను ఈ రోజు బతికున్నాను. దయచేసి బైక్‌పై వెళ్లేవాళ్లు హెల్మెట్ పెట్టుకోండి. మీ అందరి ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలి.’ అని పేర్కొన్నారు. ఇంకా అల్లు అరవింద్, వైష్ణవ్‌తేజ్, దర్శకులు వైవీఎస్ చౌదరి, దేవకట్టా, అనిల్ రావిపూడి, మారుతి, ప్రశాంత్‌వర్మ, తిరుమల కిశోర్, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.