సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ ఘట్టాల చిత్రీకరణ జరుగుతున్నది. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ కెవిన్ ఆధ్వర్యంలో రోమాంచితమైన యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.
రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్ కథ ఇదని, ఓ క్రూరుడైన నియంతను అంతమొందించి తన గ్రామ ప్రజలను కాపాడే రక్షకుడిగా సాయిదుర్గతేజ్ పాత్ర శక్తివంతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. రా అండ్ రస్టిక్ ఫీల్‌తో సాగే యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు. ఐశ్వర్యలక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు: కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, రచన-దర్శకత్వం: రోహిత్ కె.పి.