సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక పానిండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘SYG’ (సంబరాల యేటిగట్టు). ఐశ్వర్యలక్ష్మి కథానాయిక. రోహిత్ కె.పి దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాకు చెందిన కొత్త పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. బూడిద రంగు చొక్కా ధరించి, సాంప్రదాయ పంచె కట్టుతో తెల్లటి ఆవును నడిపిస్తూ వస్తున్న సాయిదుర్గతేజ్ని ఈ పోస్టర్లో చూడొచ్చు.
ఈ పోస్టర్ బట్టి ఇది గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ అని తెలుస్తున్నది. గుబురు గడ్డం, తీక్షణమైన చూపు, చిరునవ్వు.. ఈ మూడింటితో మొరటుగా సాయిదుర్గతేజ్ కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన కంప్లీట్‌గా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారని, ఇప్పటివరకూ చూడని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఆయన చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెట్రి పళనిసామి, సంగీతం: బి.అజనీష్ లోకనాథ్, నిర్మాణం: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్.