Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఎట్టకేలకు రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. నాగచైతన్యతో విడాకులు తీసుకుని నాలుగేళ్లు అయిన తర్వాత ఆమె ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. డిసెంబర్ 1వ తేదీ ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలోని లింగ భైరవి సన్నిధిలో సంప్రదాయ భూత శుద్ధి పద్ధతిలో వీరి వివాహం జరిగింది. అనంతరం ఈ విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. వివాహం తర్వాత సమంతకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా, మరికొందరు మాత్రం ఆమెపై విమర్శకలు చేస్తుండడం చర్చకు దారితీశాయి. కొందరు సెలబ్రిటీలు పెట్టిన పోస్టులను సమంతకు ఆపాదిస్తూ నెటిజన్లు వివాదం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో రెండు పోస్టులు ప్రత్యేకంగా వైరల్ అవుతున్నాయి.
ముందుగా నటి పూనమ్ కౌర్ X (Twitter) లో ఒక ట్వీట్ చేస్తూ, “సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం. బలహీన పురుషులను డబ్బుతో కొనుగోలు చేయవచ్చు. అహంకారంతో నిండిన ఒక మహిళను పేడ్ పీఆర్ టీమ్ గొప్పగా చూపిస్తుంది.”అని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవో స్పష్టత లేకపోయినా, సమంత పెళ్లి అనంతరం వచ్చినందున అందరి దృష్టి ఆమె వైపే మళ్లింది.ఇంతలో సమంతకు గతంలో పర్సనల్ మేకప్ స్టైలిస్టుగా పనిచేసిన సద్నా సింగ్ కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వివాదాస్పద పోస్ట్ చేసింది. “బాధితురాలిగా విలన్ బాగా నటించింది” అంటూ రాసిన ఆమె, అదే రోజు సమంతను అన్‌ఫాలో చేయడం హాట్ టాపిక్ అయింది . దీంతో నెటిజన్లు ఈ వ్యాఖ్యలన్నీ సమంతను ఉద్దేశించినవేనని భావిస్తున్నారు.
నిన్న,ఈ రోజు వచ్చిన పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పోస్టుల అసలు ఉద్దేశ్యం తెలియనప్పటికీ, నెటిజన్లు మాత్రం సమంతని ఉద్దేశించే అన్నారని ముచ్చటించుకుంటున్నారు. ఇక సమంత వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగా, ఆమె కెరీర్ పరంగా చూస్తే ‘ఏ మాయ చేసావే’ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. నాగచైతన్యతో నాలుగేళ్ల వివాహ జీవితం తర్వాత విడాకులు తీసుకున్న ఆమె ఇప్పుడు రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. రాజ్ నిడిమోరుకు ఇదివరకే శ్యామలీతో వివాహం జరగగా, వారికి పిల్లలు కూడా ఉన్నారు. విడాకుల అనంతరం ఇప్పుడు సమంతను వివాహం చేసుకున్నారు.