Sita Ramam | ఈ మధ్య దొంగలు యదేచ్చగా దొంగతనాలకి పాల్పడుతున్నారు. ఎంత జాగ్రత్త వహించిన వస్తువులు అపహరణకి గురి అవుతున్నాయి. ఈ క్రమంలో నటి రుక్మిణి విజయ్ కుమార్ కారులో వజ్రపు ఉంగరాలు సహా 23 లక్షల విలువైన వస్తువులు దొంగిలించబడడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయగా, కప్పన్ పార్క్ పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. బెంగళూరులో టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్న మొహమ్మద్ మస్తాన్ దొంగతనం చేసినట్టు తేలగా, దొంగిలించబడ్డ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాలలోకి వెళితే మే 11న ఉదయం రుక్మిణి వాకింగ్ కి వెళ్ళినప్పుడు చిన్నస్వామి మైదానం 18వ గేట్ దగ్గర తన కారుని పార్క్ చేసి లోపలికి వెళ్లింది. అప్పుడు కారులో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్, పర్స్, రెండు వజ్రపు ఉంగరాలు, రోలెక్స్ వాచ్ లాంటి విలువైన వస్తువులు ఉన్నాయట. అయితే ఆమె కారు పార్క్ చేశాక హడావిడిగా లాక్ వేయకుండానే వెళ్లింది. ఇక దీనిని అవకాశంగా తీసుకున్న టాక్సీ డ్రైవర్ మస్తాన్ కారులోని వస్తువులను దొంగిలించాడు. దాంతో రుక్మిణి కప్పన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసి దాదాపు 23 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన నిందితుడిని కస్టడీకి పంపి దర్యాప్తు చేస్తున్నారు. ఇక పబ్లిక్ ప్లేస్ లలో జాగ్రత్తగా ఉండాలని, విలువైన వస్తువులను ఇంట్లోనే భద్రంగా ఉంచుకోవాలని రుక్మిణికి పలు జాగ్రత్తలు చెబుతున్నారు. రుక్మిణికి తిరిగి 1.5 లక్షల విలువైన బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్, 75,000 విలువైన డిజైనర్ పర్స్, 10 లక్షల విలువైన డైమండ్ రింగ్, 9 లక్షల విలువైన రోలెక్స్ వాచ్, 3 లక్షల విలువైన మరో డైమండ్ రింగ్ పోలీసులు అందించారు. అందుకు రుక్మిణి వారికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక రుక్మిణి విషయానికి వస్తే ఆమె కన్నడ సినిమా ‘బజరంగి’ లో కృష్ణ పాత్రతో మంచి పేరు తెచ్చుకుంది. నృత్యకారిణి అయిన ఆమె కన్నడతో పాటు, తమిళం,తెలుగు, హిందీ సినిమాల్లో కూడా పలు సినిమాలు చేసింది. తెలుగులో సూపర్ హిట్ మూవీ సీతారామం చిత్రంలో కీలక పాత్రలో నటించింది.