కన్నడనాటి యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది కథానాయిక రుక్మిణి వసంత్. కన్నడ అనువాద చిత్రం ‘సప్తసాగరాలు దాటి’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ సినిమాలో నాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా ప్రతిష్టాత్మక చిత్రం ‘కాంతార చాప్టర్-1’లో రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటిస్తున్నది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆమె ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
ఇందులో ఆమె కనకావతి అనే పాత్రలో కనిస్తుందని, కథాగమనంలో ఈ పాత్ర ప్రధాన భూమిక పోషిస్తుందని మేకర్స్ తెలిపారు. రిషబ్‌శెట్టి కథానాయకుడిగా స్వీయదర్శకత్వంలో ‘కాంతార చాప్టర్-1’ తెరకెక్కుతున్నది. 2022లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘కాంతార’కు ప్రీక్వెల్ ఇది. కాంతారకు ముందు జరిగిన కథగా రూపొందిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. అక్టోబర్ 2న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.