Prabhas | ప్రభాస్ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ పేరుతో భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆఖరులో షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘కల్కి’తో ప్రభాస్, ‘యానిమల్’ సినిమాతో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా పాన్ ఇండియా స్థాయిలో అద్భుత విజయాల్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌పై దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో ఆసక్తి పెరిగిపోతున్నది.
సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. కెరీర్లో తొలిసారి ఆయన పోలీస్ పాత్రను చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ హంగులు, స్పెషల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నారని, బడ్జెట్ విషయంలో అన్కాంప్రమైజ్డ్గా ఉండాలని దర్శకుడు సందీప్ రెడ్డి నిర్ణయించుకున్నారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.