తాను పుట్టిపెరిగిన నేల. తనకు ఎత్తు పల్లాలు నేర్పిన నేల.. స్వరాష్ట్రంలో అతని కళ్లముందే పదేండ్లలో వందేండ్ల అభివృద్ధిని చూసిన నేల ఇది. ఈ తెలంగాణ వైభవంపై ఎప్పటికైనా ఒక అద్భుతమైన పాటను అందించాలనేది రాకింగ్ రాకేశ్ కోరిక. అది తన మొదటి సినిమాతోనే తీరిపోయింది. యూట్యూబ్ నుంచి సోషల్ మీడియా వేదికల వరకూ ఎక్కడ చూసినా ‘పదగతులు స్వర జతులు.. పల్లవించిన నేల..’ అన్న పాట
ఉర్రూతలూగిస్తున్నది. ఈ పాట పుట్టినిల్లు ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్) సినిమా అయితే, అందులో హీరో రాకేశ్. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమాకు నిర్మాత కూడా అతనే. ఈ చిత్రంలోని పాటలు ఇప్పుడు తెలుగు రాష్ర్టాలను ఊపేస్తున్నాయి. తెలంగాణలోని మారుమూల గిరిజన తండాలోని లంబాడా సంస్కృతి మేళవింపులు, భావోద్వేగాలు కలగలసిన ఈ చిత్రం నేడు విడుదలైంది. ఈ సందర్భంగా
రాకింగ్ రాకేశ్ ‘జిందగీ’తో పంచుకున్న కబుర్లు ఆయన మాటల్లోనే..
మాది వరంగల్. మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం. మా అమ్మ వంటలు చేస్తుంటుంది. నాకు మిమిక్రీ అంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేది. పదమూడో ఏట నుంచే మిమిక్రీ చేయడం ప్రారంభించాను. కాకతీయ యూనివర్సిటీలో మిమిక్రీలో డిప్లొమా చేశాను. అమ్మ కష్టం చూడలేక మధ్యలోనే చదువు మానేసి కళారంగం వైపు అడుగులు వేశాను. 2007లో హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. ఒక చిన్న ఆఫీసులో బాయ్‌గా పనిచేస్తూ మిమిక్రీ ఆర్టిస్టుగా నా అదృష్టం పరీక్షించుకున్నాను. మొదటిసారిగా దూరదర్శన్‌లో ‘నవ్వుల్ నవ్వుల్’ కార్యక్రమంలో మిమిక్రీ చేశాను. వెంట్రిలాక్విజం కూడా చేసేవాణ్ని. 2008లో ఈటీవీలో ‘ఆంధ్రావాలా’, జెమినీలో ‘నవ్వుల సవాల్’ కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాను. పుట్టినరోజు ఈవెంట్స్‌లోనూ పాల్గొనేవాణ్ని. అలా సంపాదించిన డబ్బులు అమ్మకు పంపుతుండేవాణ్ని.
‘ఆర్కే న్యూస్’ చానెల్లో యాంకర్‌గా అవకాశం వచ్చింది. ‘మా జూనియర్స్’లో ‘వాగుడుకాయ’ అనే షోలో వెంట్రిలాక్విజం ప్రదర్శించాను. ఆ సమయంలో కమెడియన్ ధన్‌రాజ్ అన్నతో పరిచయమైంది. తర్వాత నా జీవితమే మారిపోయింది. 2013లో ‘జబర్దస్త్’ మొదలైంది. అప్పుడు ధన్‌రాజ్ అన్న అదుర్స్ రఘు (రోలర్ రఘు)ని కలవమని చెప్పారు. రఘన్న టీమ్‌లోనే నాకు అవకాశం వచ్చింది. 13 ఎపిసోడ్ల తర్వాత ఆయన వెళ్లిపోయారు. మళ్లీ ఖాళీగా ఉన్న నన్ను ధన్‌రాజ్ అన్న చేరదీశారు. ఆయనతో కలిసి పనిచేశాను. కంటెస్టెంట్ నుంచి టీమ్‌లీడర్ వరకు నా ప్రయాణం మీరంతా చూసిందే! అయితే జబర్దస్త్‌లో కొత్తగా పిల్లలతో కామెడీ చేయించడం మొదలు పెట్టాను. దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ఇదంతా నా శ్రమను గుర్తించి, నాకు అవకాశం ఇచ్చిన వారి వల్లే సాధ్యమైంది. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను.
జబర్దస్త్ సక్సెస్‌తో సినిమాల్లోనూ చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. మా అమ్మకు మాత్రం నేను హీరో అవ్వాలని ఉండేది. నావరకైతే సినిమాల్లో రాణిస్తే చాలు అనుకునేవాణ్ని. నాకు కథలు రాయడం, చెప్పడం, ఒక అంశాన్ని కొత్తగా ప్రజెంట్ చేయడం బాగా ఇష్టం. అందులో భాగంగానే ‘కేసీఆర్’ కథను అనుకున్నా. నా భార్య సుజాత ప్రోత్సాహంతో ఆ కథ ముందుకు వెళ్లింది. ఇది సినిమాగా రూపొందడానికి ఎందరో సహకరించారు. తనికెళ్ల భరణి గారు.. నా గురించి తెలిసి, ఒక్క రూపాయి తీసుకోకుండా నటించారు. స్క్రిప్ట్ విషయంలోనూ సహకారం అందించారు. ధన్‌రాజ్ అన్న చాలా సాయం చేశారు. మైమ్ మధు, తాగుబోతు రమేశ్, జోర్దార్ సుజాత, జబర్దస్త్ మిత్రులు ఇలా ఎందరో వెన్నుతట్టి నన్ను ప్రోత్సహించారు. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు సత్యకృష్ణగారి కూతురు అనన్య కృష్ణన్ ఈ సినిమాలో హీరోయిన్. నేను వెళ్లి వారికి కథ చెప్పగానే వెంటనే ఒకే అన్నారు. లంబాడా ఆడబిడ్డలు ఎలా ఉంటారు, వారి మాట విధానం, ప్రవర్తన, సంప్రదాయాలు అన్నీ తను మాతోపాటు వచ్చి తెలుసుకుంది. ఇలా వీళ్లంతా కథను నమ్మి వచ్చారు.
కేసీఆర్ అనే పదం.. స్వరాష్ర్టాన్ని కాంక్షించిన ప్రతి తెలంగాణ వ్యక్తి గుండెలో నిలిచిపోయింది. రాష్ట్ర సాధనకు ముఖ్యకారణం ఆయన. అంతేకాదు ‘మాది తెలంగాణ’ అని రొమ్ము విరుచుకొని చెప్పుకొనేలా రాష్ర్టాన్ని అగ్రపథాన నిలబెట్టారు. అటువంటి గొప్ప వ్యక్తికి.. ఈ సినిమాలోని ‘ఛోటా కేసీఆర్’ వీరాభిమాని. ఈ చోటా కేసీఆర్ అల్లరి చేస్తాడు, నవ్విస్తాడు, కవ్విస్తాడు, ఏడ్పిస్తాడు! మొదట నేను ఈ కథ పట్టుకొని చాలామంది చుట్టూ తిరిగాను. కొందరికి నచ్చలేదు. ఈ ప్రయాణంలో నేను మాత్రమే దీన్ని చేయగలను అనిపించింది. అలా ఈ సినిమా పట్టాలెక్కింది. ‘గరుడవేగ’ అంజిగారు ఈ సినిమాకు దర్శకత్వం, సినిమాటోగ్రఫీ చేశారు. వారి సహకారం మర్చిపోలేనిది. ఈ సినిమాలో మా కథే హీరో! ఇందులో లంబాడాల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, భావోద్వేగాలు అన్నీ ఉన్నాయి.
ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంతోపాటు
అవార్డులూ గెలుచుకుంటుందని నమ్ముతున్నా!
మొదటిసారి కేసీఆర్ సార్‌ను కలిసినప్పుడు నాకు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఈ సినిమా విడుదలై, విజయవంతం అయ్యాక సార్ నుంచి పిలుపు వస్తుందనుకున్నా! కానీ.. ఈ సినిమాలో ‘పదగతులు స్వర జతులు’ అనే పాట విని ఆయన నన్ను పిలవడం ఆశ్చర్యం, ఆనందం కలిగించాయి. ఆ పాటలో కొన్ని పదాలను ఆయనే రీ కన్స్ట్రక్షన్ చేసి, మళ్లీ రాయించడం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆయనొక విజ్ఞాన గని. సార్‌ను చూస్తేనే ఒక ధైర్యం వచ్చింది.
‘కేసీఆర్’ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే.. నేను తీస్తున్నది ఒక చిన్న సినిమా. కానీ, నా సినిమా ప్రత్యేకంగా ఉండాలని, అది ఒక కోహినూర్ వజ్రంలా అందరికీ గుర్తుండిపోవాలనే ఆశతో.. తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారి పేరు కలిసి వచ్చేలా ‘కేశవ చంద్ర రమావత్’ అనే టైటిల్ పెట్టా. ‘కేసీఆర్’ అనేది ఒక పేరు మాత్రమే కాదు. అదొక బ్రాండ్. కొన్ని పేర్లు ప్రపంచాన్నే కుదిపేశాయి. వాటిల్లో ఒకటి కేసీఆర్. ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్, ఒక ఏఎన్నార్.. ఒక కేసీఆర్. ఈ లోకల్ బ్రాండ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ మూడు అక్షరాలు చాలా పవర్ ఫుల్.
నాకు అస్సలు ఇష్టంలేని పదం పెండ్లి. అలాంటిది సూజాత పరిచయంతో నా ఆలోచన్నీ మారిపోయాయి. అనుకోకుండా ఆమెతో పరిచయం, ప్రేమ, పెండ్లి అన్నీ మధురానుభూతులు. తను ఇప్పుడొక మంచి జీవిత భాగస్వామి. హెచ్ఎంటీవీలో ఆమె పని చేస్తున్నప్పుడు.. నన్ను ఇంటర్వ్యూకు పిలిచింది. అప్పుడు మా ఇద్దరి మధ్యా చిగురించిన స్నేహం.. అందమైన జీవితంగా రూపుదిద్దుకుంది. మాకు ఓ కూతురు. తన పేరు ఖ్యాతిక.
– రవికుమార్ తోటపల్లి