వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) ఛార్జీలు చిన్న నిర్మాతలకు భారంగా మారాయని, వాటిని తగ్గించాలని కోరుతూ నిర్మాత ఆర్.కె.గౌడ్, ‘దీక్ష’ మూవీ టీమ్ సోమవారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, నిర్మాతలు గురురాజ్, లయన్ సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ ‘కొన్నేళ్ల క్రితం డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ వచ్చినప్పుడు ఉచితంగా ప్రదర్శించారు. తర్వాత ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఏడేళ్ల తర్వాత ఛార్జీలు ఉండవని చెప్పారు.
ఇప్పుడు 12ఏండ్లవుతున్నా ఛార్జీలు కొనసాగిస్తూనే ఉన్నారు. చిన్న నిర్మాతలు సినిమా రిలీజ్ చేసుకోవాలంటే వీపీఎఫ్ ఛార్జీలే ఐదు నుంచి పది లక్షలు అవుతున్నాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పటికైనా తీరు మార్చుకొని డిజిటల్ ఛార్జీలు తగ్గించాలి’ అన్నారు.