Rishabh Shetty | దక్షిణాది సినీ పరిశ్రమలో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. రిషబ్ శెట్టి చేసిన పని ఇప్పుడు టాలీవుడ్, సాండల్‌వుడ్ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్‌గా మారింది. తనకు బ్రేక్ ఇచ్చిన నిర్మాణ సంస్థతో పాటు అత్యంత సన్నిహితులను కూడా సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం సంచలనంగా మారింది. ప్రత్యేకంగా ‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ అధికారిక ఖాతాను రిషబ్ శెట్టి అన్‌ఫాలో చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ వ్యక్తిగత ఖాతాను మాత్రం ఇంకా ఫాలో అవుతుండటం గమనార్హం. దీంతో సమస్య సంస్థతోనా? లేక నిర్వహణతోనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది మాత్రమే కాదు, కన్నడ ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితుడైన రాజ్ బి. శెట్టిను కూడా రిషబ్ అన్‌ఫాలో చేయడం మరింత చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసి ఎదిగిన స్నేహితులు కావడంతో ఈ పరిణామం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అదేవిధంగా ‘కాంతార’ చిత్రంలో నటించిన రుక్మిణి వసంత్‌ను కూడా అన్‌ఫాలో చేయడం ఊహాగానాలకు తావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నెటిజన్లు వివిధ కోణాల్లో చర్చిస్తున్నారు. ఇది నిజంగానే వ్యక్తిగత విభేదాల ఫలితమా? లేక కొత్త సినిమా ప్రమోషన్ కోసం వేసిన స్ట్రాటజీనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే, రిషబ్ శెట్టి కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. కాంతార సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన, ఇప్పుడు వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా జై హనుమాన్ చిత్రంలో హనుమంతుడి పాత్రలో కనిపించనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సక్సెస్ సమయంలో టీమ్ సభ్యులను సోషల్ మీడియా నుంచి దూరం పెట్టడం వెనుక అసలు కారణం ఏమిటనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. రిషబ్ శెట్టి ఈ అంశంపై స్పందించే వరకు ఈ సస్పెన్స్ కొనసాగడం ఖాయం.