Rishab Shetty | కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ కాంతార 2 (కాంతార ఛాప్టర్ 1) ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వచ్చిన “కాంతార” ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే క్రమంలో వచ్చిన ఈ ప్రీక్వెల్‌ను కూడా భారీ బడ్జెట్‌తో హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందురు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్లు పనిచేయడం విశేషం. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో కూడా నటించి మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.
అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కాంతార ఛాప్టర్ 1, మూడేళ్ల క్రితం వచ్చిన ఒరిజినల్ కాంతార సినిమాకు ప్రీక్వెల్. అప్పట్లో కేవలం రూ.15-20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా సుమారు రూ.400 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం రేపింది. అయితే తాజాగా వచ్చిన చాప్టర్ 1 కోసం మాత్రం నిర్మాతలు సుమారు రూ.125 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. అయితే చిత్రం విడుదలకు ముందు బెంగళూరులో నిర్వహించిన ప్రీమియర్ షోకు రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి శెట్టితో కలిసి హాజరయ్యాడు. షో ముగిసిన తర్వాత ఆమె భావోద్వేగానికి లోనై కన్నీళ్లతో రిషబ్‌ను కౌగిలించుకుంది.
సినిమా షూటింగ్ సమయంలో రిషబ్ ప్రమాదానికి గురవడంతో ఆమె ప్రతి రోజూ పూజలు చేసినట్టు తెలిసింది. చిత్రం అద్భుతంగా రావడంతో తన భర్తని కౌగిలించుకొని గర్వంతో ఆమె ఎమోషనల్ అయ్యారు. ప్రగతి శెట్టి ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గాను పనిచేశారు, అంటే ఆమె కూడా ఈ విజయంలో ఓ భాగమే. ప్రస్తుతం కాంతార 2కు అన్ని కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన రిషబ్ శెట్టితో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.