ఇటీవల ‘కాంతార ఛాప్టర్-1’ చిత్రంతో భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు కన్నడ అగ్ర నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రాల అప్డేట్స్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిషబ్‌శెట్టి ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో బ్లాక్‌బస్టర్ హిట్ ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ ఒకటికాగా, అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న పీరియాడిక్ సినిమా మరొకటి. ‘జై హనుమాన్’ త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.
ఇక అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రిషబ్‌శెట్టి నటిస్తున్న సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. బంకించంద్ర ఛటోపాధ్యాయ రాసిన ‘ఆనంద్‌మఠ్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. 1763-1800 మధ్య బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు చేసిన సాయుధ పోరాటం, తిరుగుబాటు నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని, ఇందులో రిషబ్‌శెట్టి సన్యాసులకు నేతృత్వం వహించిన యోధుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రానికి ’1770’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.