RGV | సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు తనదైన విమర్శలతో ప్రకంపనలు సృష్టించే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఈసారి ఆయన నేరుగా చిత్ర దర్శకులు, రచయితల మైండ్‌సెట్‌ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆయన తన వ్యాఖ్యల్లో ఏ ఒక్క పరిశ్రమ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినప్పటికీ.. ప్రస్తుతం టాలీవుడ్లో నడుస్తున్న కమర్షియల్ ధోరణిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని తెలుస్తుంది.
వర్మ తన పోస్ట్‌లో రాసుకోస్తూ.. చిత్ర పరిశ్రమలోని వారందరం ఒక ఘోరమైన వ్యాధితో బాధపడుతున్నామంటూ వర్మ ఒక చేదు నిజాన్ని బయటపెట్టారు. మనకు మనస్ఫూర్తిగా నచ్చిన, మనం బలంగా నమ్మిన ఒక కథను నిజాయితీగా తెరపై చెప్పడం ఎప్పుడో మానేశాం. ప్రేక్షకులకు లేదా ఇతరులకు ఏం నచ్చుతుందని మనం ముందుగానే ఊహించుకుంటామో.. ఎప్పుడూ అలాంటి కథలనే వండటానికి ప్రయత్నిస్తుంటాం అని వర్మ ఘాటుగా విమర్శించారు. ఇదే ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న అతిపెద్ద రోగమని ఆయన తేల్చిచెప్పారు.
నేటి తరం మేకర్స్ క్రియేటివ్ ఫ్రీడమ్‌ను పక్కనపెట్టి, కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లు, మార్కెట్ సమీకరణాలు, రొటీన్ ఫార్ములాల వెనక పరిగెడుతున్నారని, దీనివల్ల సినిమాల్లో ఒరిజినాలిటీ పూర్తిగా మిస్ అవుతోందని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఆడియన్స్ పల్స్ పేరుతో మేకర్స్ ముందే ఒక అంచనాకు వచ్చేసి… కథ డిమాండ్ చేయకపోయినా అనవసరమైన ఫైట్లు, పాటలు, లవ్ ట్రాక్‌లు వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడం వల్ల సినిమా అసలు ఆత్మ దెబ్బతింటుందని ఆయన చెప్పుకోచ్చాడు.