న్యూఢిల్లీ, ఆగస్టు 17: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మున్ముందు మరింత దిగజారవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ కరెన్సీ రికార్డు స్థాయిలకు పడిపోవచ్చని తాజాగా ఫిచ్ సొల్యూషన్స్ కంపెనీ బీఎంఐ చెప్తుండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) ఆఖరు (వచ్చే ఏడాది మార్చి 31)నాటికి మునుపెన్నడూ లేనివిధంగా 97 వద్దకు భారతీయ కరెన్సీ పతనం కావచ్చని బీఎంఐ అంచనా వేసింది. అంతేగాక వచ్చే ఆర్థిక సంవత్సరం (2027-28) 99కి క్షీణించే వీలున్నదని అంటుండటం ఒకింత కలవరపాటుకు గురిచేస్తున్నదిప్పుడు.
పెరుగుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, అననుకూల సెంట్రల్ బ్యాంక్‌ల ద్రవ్య విధానాలు.. రూపాయి విలువను తీవ్రంగా ఒత్తిడికి గురిచేస్తున్నట్టు బీఎంఐ తెలిపింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి, రవాణాకు అడ్డంకులు ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ రేట్లు విజృంభించగా.. దాదాపు 90 శాతం దిగుమతులతోనే ఇంధన అవసరాలను తీర్చుకుంటున్న భారత్ ఇబ్బందుల్లో పడుతున్నది. కరెన్సీ మార్కెట్లో డాలర్లకు పెరుగుతున్న డిమాండ్.. రూపీ వాల్యూను క్రమేణా దిగజార్చుతున్నది మరి.
కాగా, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు మొదలైన దగ్గర్నుంచి రూపాయి మారకం విలువ సుమారు 4 శాతం నష్టపోయిందంటే.. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం భారత్‌పై ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 6 నెలలుగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుండగా.. పరిస్థితులు ఇలాగే ఉంటే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ త్వరలోనే సెంచరీ (100) కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. ఈ ఏడాది మే 20న తొలిసారి 96.86 వద్ద ముగిసిన రూపాయి విలువ.. అదే రోజు ట్రేడింగ్‌లో ఒకానొక దశలో 96.95 స్థాయికి దిగిన సంగతి విదితమే.
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ నష్టాల్లో ముగిసింది. సోమవారం డాలర్‌తో పోల్చితే 19 పైసలు పడిపోయి 95.61 వద్ద స్థిరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరుగడం.. దెబ్బతీసినట్టు ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం ఇప్పుడప్పుడే తొలగిపోయే అవకాశాలు లేకపోవడంతో క్రూడాయిల్ రేట్లు భగ్గుమంటున్నాయి. దీంతో డాలర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇది రూపీని బలహీనపర్చిందని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
ఎల్ నినో కారణంగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు వర్షపాతాన్ని గణనీయంగా తగ్గించేస్తున్నాయి. వర్షాకాలం మొదలై 2 నెలలు దాటిపోయినా పంటల సాగు పనులు ఆశించిన స్థాయిలో ముందుకు పడటం లేదు. దేశీయంగా వ్యవసాయం ప్రధానంగా వర్షాధారమేనన్నది తెలిసిందే. దీంతో ఈసారి ద్రవ్యోల్బణం పరుగులు పెట్టడం ఖాయమన్న అంచనాలే ఉన్నాయి. ఇదే జరిగితే ధరలను అదుపులో పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్లను పెంచుతుందని, ఫలితంగా రుణాలు భారమై అన్ని రంగాల్లో వృద్ధి కుంటుపడుతుందని, చివరకు దేశ జీడీపీ వృద్ధి మందగమనంలోకి జారుకుంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు బీఎంఐ సైతం ఇదే ఆందోళనల్ని వ్యక్తపర్చింది. ఇది కూడా రూపాయి విలువపై ప్రభావం చూపుతుందన్నది. ఇక బలహీనపడుతున్న రూపాయి.. దేశీయ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై మదుపర్లలో ఆందోళనల్ని రేకెత్తిస్తున్నట్టు బీఎంఐ ఈ సందర్భంగా తమ నోట్లో పేర్కొన్నది.