RGV | రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ మూవీ ‘టాక్సిక్’ టీజర్ జనవరి 8న విడుదలైన వెంటనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, టీజర్‌తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఒక మహిళా దర్శకురాలు ఇంత రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో కూడిన వైల్డ్ కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకురావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీజర్ విడుదలైన తర్వాత ప్రశంసల వర్షం కురుస్తుండగా, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించిన వర్మ, గీతూ మోహన్ దాస్ విజన్‌ను ఆకాశానికెత్తేశారు.
టాక్సిక్ టీజర్ చూసిన తర్వాత గీతూ మహిళా సాధికారతకు ఇది నిలువెత్తు ఉదాహరణ అని అర్థమైంది అంటూ ఆమె మేకింగ్ స్టైల్‌పై తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇలాంటి పవర్ఫుల్ విజువల్స్‌ను సృష్టించడంలో ఆమె చాలా మంది మగ దర్శకులకంటే ముందుందని వ్యాఖ్యానించారు. టీజర్లో చూపించిన కొన్ని సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒక క్రిస్టియన్ శ్మశానంలో అంత్యక్రియల సమయంలో మాఫియా డాన్లు, అండర్వర్ల్డ్ పాత్రలు గుమికూడిన సందర్భం… అదే సమయంలో దూసుకొచ్చే లగ్జరీ కారు, అందులో యష్ రొమాంటిక్ మూడ్‌లో కనిపించడం… అనుకోకుండా జరిగే పేలుడు… ఈ మొత్తం సీక్వెన్స్‌ను గీతూ మోహన్ దాస్ ఎంతో స్టైలిష్‌గా, నెరేటివ్‌కు బలం చేకూరేలా డిజైన్ చేశారని విమర్శకులు చెబుతున్నారు. ముఖ్యంగా విధ్వంసాన్ని కూడా ఎలిగెన్స్‌తో చూపించగలగడం ఆమె మేకింగ్‌లోని ప్రత్యేకతగా అభివర్ణిస్తున్నారు.
ఆర్జీవీ ప్రశంసలతో పాటు సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు గీతూ మోహన్ దాస్ ఇండియన్ సినిమాకు కొత్త స్థాయి తీసుకొస్తోందని మెచ్చుకుంటున్నారు. కథ ఎంపిక, షాట్ డిజైన్, విజువల్ స్టైల్ అన్ని కలిసి ఈ సినిమా కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు, గతంలో హింసకు వ్యతిరేకంగా మాట్లాడిన గీతూ ఇప్పుడు గ్లోరిఫైడ్ వైలెన్స్ ఉన్న సినిమా చేస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. ఏదేమైనా, ‘టాక్సిక్’ టీజర్‌తోనే ఇండస్ట్రీలో బోల్డ్ మేకింగ్‌కు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశిందని చెప్పొచ్చు. సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తే ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ఆసక్తి మరింత పెరిగింది. టీజర్లో అధికారికంగా ప్రకటించినట్టుగా, ‘టాక్సిక్’ 2026 మార్చి 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో యష్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం.