Rewind 2024 | ఒకప్పుడు తెలంగాణ యాస, భాష అంటే సినిమాల్లో కూడా చిన్నచూపు ఉండేది. కానీ కొద్దిరోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తెలంగాణ నేపథ్యంలో సినిమాలు రావడం ఎక్కువయ్యాయి. అలా 2024లోనూ తెలంగాణ నేపథ్యంతో టాలీవుడ్లో చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. వీటిలో కొన్ని సినిమాలు అంచనాలు అందుకోవడంలో విఫలమైనప్పటికీ.. మరికొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాయి.
2024లో తెలంగాణ యాసలో తెరపైకి వచ్చిన చెప్పుకోదగ్గ సినిమాలను నిశితంగా పరిశీలిస్తే స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వైర్ 100 కోట్ల క్లబ్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే హైదరాబాద్ సంస్థానంలో 1940 లో జరిగిన అరాచకాల మీద వచ్చిన రజాకార్ సినిమా కూడా మొదటి షో నుంచే మంచి టాక్‌తో కలెక్షన్లను రాబట్టింది. తెలంగాణ పెళ్లి నేపథ్యంలో వచ్చిన లగ్గం సినిమా కూడా థియేటర్లో డీసెంట్‌గా హిట్‌గా నిలిచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది.
డిఫెరెంట్ స్టైల్ ప్రమోషన్స్‌తో ప్రజల్లోకి వచ్చిన పొట్టేలు ఫర్వాలేదని అనిపించింది. జితేందర్ రెడ్డి, ఉరుకు పటేల, లైన్ మాన్, ప్రవీణ్ IPS , కల్లు కాంపౌండ్, పైలం పిలగా, షరతులు వర్తిస్తాయి, గొర్రెపురాణం, బహిర్భూమి , కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్).. ఇలా వైవిధ్య భరితమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. ఇన్ని సినిమాలు తెలంగాణ నేపథ్యంలో వచ్చిన కథ, కథనాలు, రొటీన్‌గా ఉండటం, మేకింగ్ నాసిరకంగా ఉండటం, నిర్మాణ విలువలు లేకపోవడంతో చాలా సినిమాలు చతికిలపడ్డాయి.
థియేటర్లోనే కాకుండా ఓటీటీల్లోనూ తెలంగాణ నేపథ్యంలో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రముఖ సింగర్ సునీత కొడుకు హీరోగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన సర్కారు నౌకరి ఓటీటీ ప్రేక్షకుల మన్ననలు పొందింది. అలాగే థియేటర్లో హిట్ టాక్ సంపాదించుకుని ఓటీటీలోకి వచ్చిన లగ్గం సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో అలరించింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచింది.