Tollywood Film Industry | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై టాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతోంది. సినిమా టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షోల అనుమతుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బ్లాక్‌మెయిలింగ్‌కు పరాకాష్టగా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. తన శాఖ కాకపోయినప్పటికీ, సినిమా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ముఖ్యమంత్రి తన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని, ప్రతి చిన్న అనుమతి కోసం హీరోలు, నిర్మాతలు ఆయన కాళ్ళు మొక్కే పరిస్థితి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అనుమతులు లభించిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఖచ్చితంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పాలని ఒత్తిడి చేయడం, పిలిచినప్పుడు ఇంటికి వచ్చి తల ఊపాలని నిబంధనలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే ‘రాజాసాబ్’ సినిమా అనుమతుల విషయంలో ప్రభాస్ స్వయంగా వచ్చి కలవలేదనే నెపంతో అర్ధరాత్రి వరకు జీవోను ఆపేశారని, అదే సమయంలో చిరంజీవి సినిమాకు మాత్రం రెండు రోజుల ముందే అనుమతులు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రభాస్ కుటుంబ సభ్యులు కేటీఆర్‌తో సాన్నిహిత్యంగా మాట్లాడిన మాటలను మనసులో పెట్టుకునే రేవంత్ రెడ్డి ఇలా పగ తీర్చుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంక్రాంతి సినిమాల విడుదల నేపథ్యంలో హీరోలు తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను కూడా అడ్డం పెట్టుకుని టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, ముఖ్యమంత్రి వైఖరితో సినిమా పెద్దలు విసిగిపోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. నేను పుష్ప 2 సినిమా తర్వాత నుంచే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నా. టికెట్ ధరలు పెంచమని నన్ను ఎవరు కలుస్తలేరు. నేను ఏ సినిమాకు టికెట్ హైక్ ఇవ్వట్లేదు. సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడం మానేశాను. టికెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కోమటిరెడ్డి చెప్పుకోచ్చాడు.