Actor Darshan | రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీపతో పాటు ఆరుగురు నిందితులకు కర్నాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది విచక్షణాధికార దుర్వినియోగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రేణుకస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ బెయిల్‌ను రద్దు చేయాలని కర్నాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పు సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం కర్నాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి, తీర్పును వాయిదా వేసింది. హత్య కేసులో దర్శన్‌తో పాటు ఆరుగురికి కర్నాటక హైకోర్టు గతేడాది డిసెంబర్ 13న బెయిల్ మంజూరు చేసింది.
అయితే, హైకోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. కర్నాటక ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, నిందితుల తరఫున సిద్ధార్థ్ దవేతో పాటు ఇతరుల వాదనలు సుప్రీంకోర్టు విన్నది. ప్రభుత్వంతో పాటు పలువురు దాఖలు చేసిన లిఖితపూర్వక వాదనలను కోర్టు రికార్డు చేసింది. ఇతర నిందితుల తరఫు న్యాయవాదిని వారంలోగా లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై జస్టిస్ పార్దివాలా డిఫెన్ న్యాయవాదిని ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్లపై తీర్పును వెలువరిస్తూ ఏడుగురు నిందితులను నిర్దోషులు విడుదల చేస్తూ హైకోర్టు ఆదేశించిందని మీరు అనుకోలేదా? అని ప్రశ్నించారు. హైకోర్టు బెయిల్ ఆర్డర్ జారీ చేసిన విధానం ఆందోళన కలిగించే విషయమని ధర్మాసనం పేర్కొంది. ప్రతి బెయిల్ కేసులో హైకోర్టు ఇదే రకమైన ఆర్డర్ జారీ చేస్తుందా? అని వ్యాఖ్యానించింది.
ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలాల విషయంలో హైకోర్టు వ్యవహరించిన విధానాన్ని సైతం ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా మాట్లాడుతూ నిందితులకు బెయిల్ మంజూరు చేయడంలో విచక్షణాధికారాలను దుర్వినియోగం చేయడమేనన్నారు. హైకోర్టు న్యాయపరంగా తన విచక్షణను ఉపయోగించిందా?’ అంటూ ప్రశ్నించారు. రేణుకస్వామి హత్య కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడంపై బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. విచక్షణాధికారాన్ని ఉపయోగించిన విధానంతో తాము సంతృప్తిగా లేమని పేర్కొంది. జస్టిస్ పార్దివాలా మాట్లాడుతూ ‘నిజం చెప్పాలంటే హైకోర్టు విచక్షణాధికారాన్ని ఉపయోగించిన విధానంతో తాము సంతృప్తి చెందలేదు’ అని అన్నారు. ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు పవిత్ర గౌడతో పాటు ఈ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసింది. దర్శన్ అభిమాని అయిన రేణుకస్వామి గతేడాది జూన్‌లో హత్యకు గురవగా.. ఈ కేసులో దర్శన్‌ను జూన్ 11న పోలీసులు అరెస్టు చేశారు.