Renu Desai | టాలీవుడ్ ప్రేక్షకులకు రేణు దేశాయ్ పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన జానీ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్‌తో ప్రేమ, వివాహం, ఇద్దరు పిల్లల తల్లి కావడం… ఇలా ఆమె జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు దూరంగా, తన పిల్లలతో కలిసి స్వతంత్రంగా జీవితాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల బాధ్యతలతో పాటు తన వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యంగా నడిపిస్తూ, రేణు దేశాయ్ మళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఆమె కీలక పాత్రలకే ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కనిపించిన రేణు దేశాయ్, ఆ తర్వాత కూడా పలు అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చినట్టు ఇటీవల వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణు దేశాయ్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో తనకు అవకాశం వచ్చిందని తొలిసారిగా వెల్లడించారు. ఆ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం దర్శక నిర్మాతలు తనను సంప్రదించారని, కథ, పాత్ర రెండూ తనకు బాగా నచ్చాయని ఆమె చెప్పారు. నటించాలనే ఆసక్తి కూడా ఉన్నప్పటికీ, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
అయితే ఆ కారణాలేమిటన్నది మాత్రం ఆమె స్పష్టంగా చెప్పలేదు. ఆ విషయాలు బయటపెడితే అనవసరమైన వివాదాలు చెలరేగే అవకాశం ఉందని భావించి మౌనంగా ఉండటం మంచిదని నిర్ణయించుకున్నట్టు రేణు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. నిజంగా వ్యక్తిగత సమస్యలే కారణమా? లేక ఆ అవకాశాన్ని చేజార్చిన మరో నేపథ్యం ఉందా? అనే చర్చ నడుస్తోంది. మహేష్ బాబు సినిమాలో రేణు దేశాయ్ కనిపించలేకపోవడం అభిమానులను నిరాశపరిచినా, ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌పై మాత్రం అంచనాలు పెరుగుతున్నాయి. టైగర్ నాగేశ్వరరావు తర్వాత తాజాగా బ్యాడ్ గర్ల్స్ సినిమాలో కీలక పాత్రలో నటించి మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె ప్రయాణం ఇప్పుడు కొత్త దిశగా సాగుతోందన్నది అభిమానుల అభిప్రాయం.