పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య (Sidhu Moose Wala case)కు పాల్పడిన నిందితులే బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) హత్యకు కుట్ర చేశారని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ (DGP Gaurav Yadav) వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సూచనల మేరకు నిందితులు సల్మాన్ హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని డీజీపీ పేర్కొన్నారు.
సిద్దూ మూసేవాలా హత్యకేసు నిందితుల్లో ఒకడైన కపిల్ పండిట్‌ను డార్జిలింగ్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దులో శనివారం అరెస్ట్ చేశారు పోలీసులు. కపిల్ పండిట్‌ను విచారించగా రెక్కీ విషయం బయటకు వచ్చిందని డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జాబితాలో చాలా మంది ఉన్నారని, ఆ లిస్టులో సల్మాన్ కీ టార్గెట్ అని కపిల్ పండిట్ చెప్పాడు. ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్టు కపిల్ ఒప్పుకున్నాడు. సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు సంపత్ నెహ్రా, గోల్డీ బ్రార్ ద్వారా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కపిల్ పండిట్ ను సంప్రదించిందన్నారు డీజీపీ.
సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు గ్యాంగ్స్టర్స్ సచిన్ బిష్ణోయ్, సంతోష్ యాదవ్‌లతో కలిసి వ్యూహరచన చేయాలని బిష్ణోయ్ గ్యాంగ్ కపిల్ పండిట్‌ని కోరినట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కు భద్రతను పెంచారు పోలీసులు.