Rama Sethu | ఫిక్షన్ కథలు తేలిగ్గా జనాల్లోకెళ్లిపోతాయి. వాటికి కాస్తంత మైథాలజీని కూడా జోడిస్తే ఇక విజయానికి ఢోకా ఉండదు. రీసెంట్గా వచ్చిన కార్తికేయ2, హను-మాన్, కల్కి సినిమాలే అందుకు నిదర్శనాలు. ప్రస్తుతం హీరో నిఖిల్ ‘స్వయంభు’ అనే ఓ ఫిక్షన్ సినిమా చేస్తున్నారు. ఇది నిఖిల్ కెరీర్లో హైబడ్జెట్ మూవీ అని తెలుస్తున్నది. సోషియో ఫాంటసీ ఫిక్షన్‌గా కొత్త దర్శకుడు భరత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఠాగూర్ మధు నిర్మాత. ఈ సినిమా కథ విషయంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది.
అదేంటంటే.. ‘స్వయంభూ’ కథలో రామసేతు పాత్ర చాలా కీలకమట. రామాయణలో రావణ సంహారణార్థం వానరవీరులతో కలిసి సముద్రంపై రాముడు కట్టిన రామసేతు అవశేషాలు ఇప్పటికీ సముద్రగర్భంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇది శాస్త్రీయంగా నిరూపణ కూడా అయ్యింది. దానికి సంబంధించిన ఫొటోలు కూడా గూగుల్‌లో దర్శనమిస్తుంటాయి. దీనిపై పరిశోధనలు జరిగాయి. పుస్తకాలు కూడా వచ్చాయి. ‘స్వయంభు’ సినిమా కథలో ఈ రామసేతు కీలకం కానున్నదట. ఈ సన్నివేశాలను సీజీలో అద్భుతంగా చిత్రీకరించారట. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క జరుపుకుంటున్న ఈ సినిమాను మేలో కానీ జూన్‌లో కానీ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.