Ramcharan | రామ్ చరణ్ మరోసారి ఫ్యామిలీ ట్రిప్ వెళ్లడంతో అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ మొన్నే మొదలైంది అంటూ శంకర్ ట్వీట్ చేశాడు. అంతలోనే ఈయన మరోసారి సతీసమేతంగా విదేశాలకు వెళ్లడంతో సినిమా పరిస్థితి ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు. దీనికి సమాధానం గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ క్యాన్సిల్ అవ్వడమే. ఆల్రెడీ బాగా ఆలస్యం అవుతున్న ఈ ప్రాజెక్టు మరోసారి వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్‌లో జరగాల్సిన షెడ్యూల్ క్యాన్సిల్ కావడంతో ఈ ఖాళీ సమయాన్ని కుటుంబం కోసం కేటాయిస్తున్నాడు రామ్ చరణ్.
ఆయన ఇటలీ వెళ్లడం వెనక కేవలం టూర్ మాత్రమే కాదు.. మరో బలమైన కారణం కూడా ఉంది. రామ్‌రణ్ సతీమణి ఉపాసన కజిన్ పెళ్లి ఇటలీలో జరగబోతుంది. వాళ్ల పెళ్లి కోసమే ఇటలీ వెళ్లారు రామ్ చరణ్ దంపతులు. ఆ పెళ్లి చూసుకున్న తర్వాత వరుణ్ తేజ్ మ్యారేజ్‌కు అటెండ్ కానున్నారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి కోసం మెగా హీరోలు అందరూ అక్టోబర్ చివరి వారంలో ఇటలీ బయలుదేరుతారు. ఫ్యామిలీ ఫంక్షన్ ఉండటంతో వాళ్లందరి కంటే ముందుగానే రామ్ చరణ్ ఇటలీ వెళ్లాడు. నవంబర్ 3న మళ్లీ చరణ్ ఇండియాకు రానున్నాడు. వచ్చిన తర్వాతే గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ డీటెయిల్స్ బయటికి రానున్నాయి.
ఈ టైమ్‌ను ఇండియన్ 2 కోసం వాడుతున్నాడు శంకర్. కనీసం అదైనా త్వరగా పూర్తి చెయ్యి.. అలా చేస్తే అయినా చరణ్ సినిమాపై ఫోకస్ చేస్తారు అంటూ రామ్ చరణ్ ఫాన్స్ సోషల్ మీడియాలో శంకర్ కు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే 2024లో కూడా రామ్ చరణ్ స్క్రీన్ మీద కనిపించడం అసాధ్యమే అనిపిస్తుంది.