Jr NTR | అయోధ్య(Ayodhya)లో కౌసల్య రాముడు కొలువుదీరాడని తెలిసిందే.. కొత్తగా నిర్మించిన ఆలయంలో బాలరాముడి (Ramlalla) విగ్రహాన్ని ప్రతిష్టించారు. శ్రీ రామ జన్మభూమి రామమందిరంలో ఇవాళ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహణతో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. కన్నుల పండువగా జరిగిన ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌తోపాటు వివిధ ఇండస్ట్రీల ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్తోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ఫిలింనగర్ సర్కిల్ టాక్ ప్రకారం ప్రాణ ప్రతిష్ఠకు రావాల్సిందిగా ఆహ్వానం అందిన వారిలో టాలీవుడ్ నుంచి తొలి సెలబ్రిటీ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) యేనట. కానీ తారక్ మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు. దీనిక్కారణం దేవర షూటింగ్ అని టాలీవుడ్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
దేవరలో సైఫ్ అలీఖాన్‌తో కీలక సన్నివేశాన్ని షూట్ చేయాల్సిన కారణంగా నిర్మాతను ఇబ్బంది పెట్టవద్దని భావించిన తారక్.. అయోధ్యకు వెళ్లలేదని టాక్ నడుస్తోండగా.. మరోవైపు అనుకోకుండా సైఫ్ అలీఖాన్ గాయం కారణంగా ఆస్పత్రిలో చేరడం.. ఈ సమాచారం కూడా ఆలస్యంగా తెలువడంతో చివరి నిమిషంలో తారక్ అయోధ్య ట్రిప్ రద్దు చేసుకున్నట్టు వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలపై మాత్రం తారక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.