Devagudi | పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందించిన చిత్రం “దేవగుడి”. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ గురించి దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి మరియు నటుడు రఘు కుంచె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తాను ఉద్యోగం చేస్తున్న సమయంలో భగవద్గీత ఆధారంగా ‘యధాతథం’ అనే కాన్సెప్ట్ తో సినిమా చేయాలని అనుకున్నానని తెలిపారు. భగవద్గీత కేవలం మతగ్రంథం మాత్రమే కాదని, అది సైంటిఫిక్ గా నిజమని ఐన్ స్టీన్, అబ్దుల్ కలాం వంటి వారు చెప్పారని, ఆ ఉద్దేశంతోనే శ్రీకాంత్ గారిని హీరోగా పెట్టి సినిమా నిర్మించానని చెప్పారు. ఆ సమయంలో తన ఇన్వాల్వ్ మెంట్ చూసి శ్రీకాంత్ గారు ప్రోత్సహించడంతో దర్శకుడిగా మారి ‘దృశ్యకావ్యం’ నిర్మించానని, ఇప్పుడు దర్శకుడిగా తన రెండో మూవీగా ‘దేవగుడి’ని రూపొందించానని వివరించారు. సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్లకు ఎదురయ్యే అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఇంజినీర్ గా తనకున్న పక్కా ప్లానింగ్ తో అనుకున్న సమయంలోనే షూటింగ్ పూర్తి చేశానని, కేవలం పది శాతం బడ్జెట్ మాత్రమే పెరిగిందని తెలిపారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మరియు చిత్ర గారు పాడిన ‘ఆరో ఆరారో’ పాటకు అద్భుతమైన వ్యూస్ వస్తున్నాయని, సెన్సార్ నుంచి కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని చెప్పారు. కేవలం రెండు కట్స్ తో ‘ఎ’ సర్టిఫికేట్ లభించిందని, సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానున్న ఈ చిత్రానికి ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం నాటి ఫ్యాక్షన్ ట్రెండ్ కాకుండా, ఇందులో ఫ్యాక్షన్ ను ఒక నేపథ్యంగా మాత్రమే వాడుతూ స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ కు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా 11 నిమిషాల స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్, మదీన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణని, టికెట్ రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.
నటుడు రఘు కుంచె మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను ‘దేవగుడి వీరారెడ్డి’ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించానని, ‘పలాస’ తర్వాత తనకు ఇలాంటి మంచి రోల్స్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు. దర్శకుడు రామకృష్ణా రెడ్డి గారు చెప్పిన విధంగా రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పానని, వాస్తవ ఘటనలు జరిగిన ప్రాంతాల్లోనే షూటింగ్ నిర్వహించారని చెప్పారు. షూటింగ్ లో ఇరవై సుమోలు, జీపుల కాన్వాయ్ మధ్య ప్రయాణించడం పర్సనల్ గా గర్వంగా అనిపించిందని, అయితే బాంబ్ బ్లాస్ట్స్ యాక్షన్ సీక్వెన్సుల సమయంలో కాస్త భయమేసేదని సరదాగా పంచుకున్నారు. ఈ సినిమాలో తాను ఒక పాట కంపోజ్ చేసి పాడానని, మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ కు మంచి ఫ్యూచర్ ఉంటుందని కొనియాడారు. తాను సింగర్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చానని, యాక్టర్ కావడం అనుకోకుండా జరిగిందని చెబుతూ, ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. మనోజ్ బాజ్ పాయ్ చేసిన ‘ఫ్యామిలీ మ్యాన్’ లాంటి వైవిధ్యమైన పాత్రల్లో నటించాలనే కోరిక ఉందని, “దేవగుడి” సినిమా నటుడిగా తనకు మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నానని రఘు కుంచె ధీమా వ్యక్తం చేశారు.