రవితేజ తాజా చిత్రం ‘మాస్ జాతర’ విడుదల మరోమారు వాయిదా పడింది. ఈ నెల 27న సినిమాను విడుదల చేయబోతున్నామని గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే గత కొద్దిరోజుల క్రితం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అనుకున్న రీతిలో నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేయలేకపోయామని, అందుకే చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘ఇటీవల జరిగిన సినీ కార్మికుల సమ్మె కారణంగా కీలకమైన కంటెంట్‌ను పూర్తి చేయడంలో ఆలస్యమైంది.
అందుకే సకాలంలో రిలీజ్ చేయలేకపోతున్నాం. కాస్త టైమ్ తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలన్నదే మా ఉద్దేశ్యం. త్వరలో కొత్త విడుదల తేదీని తెలియజేస్తాం’ అని నిర్మాతలు అన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.